|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:51 PM
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. కేకే లైన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైలు సర్వీసుల గమ్యస్థానాలను రైల్వే మార్చింది. కొన్ని రైలు సర్వీసుల గమ్యస్థానాలను కుదించింది. ఈ విషయాన్ని వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ వెల్లడించారు. విశాఖ కిరండోల్ రైలు కూడా అరకులోనే నిలిపివేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయం కొన్ని రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. డిసెంబర్ 23, డిసెంబర్ 27వ తేదీలతో పాటుగా జనవరి 3, జనవరి 5వ తేదీలలో విశాఖ కిరండోల్ (58501) ప్యాసింజర్ రైలును అరకులో నిలిపి వేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రోజులలో విశాఖ- కిరండోల్ రైలు అరకు నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుందని వెల్లడించారు.
మరోవైపు విశాఖపట్నం కిరండూల్ ప్యాసింజర్ రైలు.. వారంలో అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం నుంచి ప్రతి రోజూ ఉదయం 6 గంటల 45 నిమిషాలకు విశాఖ - కిరండూల్ ప్యాసింజర్ రైలు బయల్దేరుతుంది. మర్రిపాలెం, సింహాచలం, పెందుర్తి. కొత్తవలస జంక్షన్, మల్లివీడు, శృంగవరపుకోట, బొద్దవర,చిమిడిపల్లి, బొర్రా గుహలు, కరకవలస, షిమిలిగూడ మీదుగా ఉదయం 10 గంటల 55 నిమిషాలకు అరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి కోరాపుట్ జంక్షన్, జగదల్ పూర్ మీదుగా ప్రయాణించి.. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు కిరండూల్ చేరుకుంటుంది. ఈ రైలు ద్వారా నిత్యం ఎంతో మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా ఉండటంతో పాటుగా.. అరకు అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులు ఎక్కువ మంది ఈ రైలులో వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఉదయమే విశాఖలో బయల్దేరితే 11 గంటలకు అరకు చేరుకోవచ్చు. అలాగే కొండల మధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించే వీలుంది. ఈ నేపథ్యంలో సందర్శకులకు ఈ రైలు బెస్ట్ ఛాయిస్. అయితే ఈ మార్గం ఎక్కువగా కొండల మధ్య నుంచి వెళ్తూ ఉంటుంది. దీంతో వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడుతూ.. రైలు రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంటుంది.
Latest News