|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:56 PM
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకూ పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ తోసిపుచ్చింది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారం నమ్మవద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులను కోరారు.
మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ ఛైర్మన్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలలోకి అనుమతి లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. శ్రీవారి భక్తులను తిరుమలకు రావొద్దంటూ చెప్పే అధికారం ఎవరికీ లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పా్ట్ల కోసం గడిచిన రెండు నెలలుగా పనిచేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సబ్ కమిటీ వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు చూస్తోందన్నారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి మూడు రోజులు ( డిసెంబర్ 30, 31, జనవరి 1) ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించామన్నారు. ఈ మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అయితే టోకెన్ లేకపోయినప్పటికీ.. తిరుమలకు భక్తులు రావచ్చన్న టీటీడీ ఛైర్మన్.. వారికి దర్శనాలు లేకపోవటంతో ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు.
అలాగే టోకెన్లు లేని వారికి జనవరి 2వ తేదీ నుంచి మిగతా అన్ని రోజులు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. టోకెన్లు పొందలేని భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. భక్తులకు దీనిపై అవగాహన కల్పించేందుకు బ్యానర్లు, ఫ్లెక్సీలు, బ్రాడ్ కాస్టింగ్ ఏర్పాట్లతో పాటుగా ఎస్వీబీసీ ఛానెల్, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. భక్తులు సంయమనంతో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలని సూచించారు.
Latest News