|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 08:40 PM
ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అధిక వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు ప్రయాణికులను తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. విదేశాల్లో ఇవి ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పటివరకు భారత్‌లో బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చర్యలు చేపడుతోంది. బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా వాటి తయారీపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 1న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రారంభ తేదీతో పాటు తొలి రైలు ఏ మార్గాల్లో నడుస్తుందనే వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15, 2027న భారత్‌లో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ హైస్పీడ్ రైలును జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. మొదటి దశలో సూరత్ నుంచి బిలిమోరా వరకు బుల్లెట్ ట్రైన్‌ను నడపనున్నట్లు చెప్పారు. అనంతరం వాపీ-సూరత్, వాపీ-అహ్మదాబాద్, థానే-అహ్మదాబాద్ మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. తదుపరి దశలో ముంబై-అహ్మదాబాద్ మధ్య పూర్తి స్థాయిలో బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. దీని ద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చని వివరించారు. ఇప్పటికే ఈ కారిడార్‌లో 320 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో స్టేషన్‌లు, సొరంగాలు, విద్యుత్ సంబంధిత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 2027లో తొలి ఆపరేషన్ రన్ ప్రారంభమవుతుందని, 2029 నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
Latest News