|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:03 PM
భారత్, పాకిస్థాన్ దేశాలు తమ ఆధీనంలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు దౌత్య మార్గాల ద్వారా ఈ వివరాలను పంచుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1, జులై 1 తేదీల్లో ఇరు దేశాలు ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకుంటాయి.తాజా జాబితాల ప్రకారం, పాకిస్థాన్ చెరలో 257 మంది భారతీయులు, భారతీయులుగా పరిగణించబడుతున్న వారు ఉన్నారు. వారిలో 58 మంది పౌర ఖైదీలు కాగా, 199 మంది మత్స్యకారులు ఉన్నారు. అదే విధంగా భారత దేశం ఆధీనంలో 424 మంది పాకిస్థాన్ జాతీయులు లేదా పాకిస్థాన్ జాతీయులుగా పరిగణించబడుతున్న వారు ఉన్నారు. వీరిలో 391 మంది పౌర ఖైదీలు, 33 మంది మత్స్యకారులు ఉన్నారు.అంతేకాకుండా, భారత్, పాకిస్థాన్ దేశాలు తమ అణు స్థావరాల జాబితాను కూడా పరస్పరం పంచుకున్నాయి. ఒకరి అణు కేంద్రాలపై మరొకరు దాడి చేయకూడదనే ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు ఈ మేరకు వివరాలను మార్పిడి చేసుకున్నాయి. దౌత్య మార్గాల ద్వారా రెండు దేశాలు ఒకేసారి ఈ ప్రక్రియను పూర్తి చేశాయి.
Latest News