|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:25 PM
వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలతో కూడిన ఆహారాన్ని డెలివరీ చేసిన ఘటనలో ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్, రెస్టారెంట్‌కు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం రూ.200 విలువైన బిర్యానీ విషయంలో జరిగిన నిర్లక్ష్యానికి ఏకంగా రూ.55 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వినియోగదారుల మనోభావాలను, ఆహారపు అలవాట్లను గౌరవించడంలో సంస్థ విఫలమైందని కమిషన్ పేర్కొంది.కర్నూలు నగరానికి చెందిన పోచా రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి కఠిన నియమాలు పాటించే శాకాహారి. ఆయన తన భార్య కోసం ఇటీవల ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ ప్యాకెట్ తీసుకురాగా, దానిని తెరిచి చూడగా అందులో చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజశేఖర్‌రెడ్డి.. ఈ విషయమై వెంటనే కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. సదరు యాప్ నిర్వాహకులు సరైన సమయంలో స్పందించకపోవడాన్ని కూడా ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ కేసును విచారించిన కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్‌కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, నజీమాకౌసర్‌లు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చారు. తప్పుడు ఆహారాన్ని డెలివరీ చేయడం వల్ల ఫిర్యాదుదారుడి మతపరమైన విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఇందుకు బాధ్యతగా ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ, హోటల్ యాజమాన్యం కలిసి బాధితుడికి రూ.50 వేలు పరిహారంగా, మరో రూ.5 వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.
Latest News