|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:49 PM
గతేడాది నవంబరులో హౌరా-బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన బంగారం దోపిడీ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారే దోపిడీలో కీలక సూత్రధారి అని తెలిసి పోలీసులు షాకయ్యారు. దీంతో ఆ అధికారిని అరెస్ట్ చేశారు. వివరాల్లో వెళ్తే.. గతేడాది నవంబరులో కోల్‌కతాకు చెందిన నగల వ్యాపారి వద్ద పనిచేస్తోన్న ధనంజయ్ శషావత్.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఓ దుకాణానికి బంగారం డెలివరీ చేయడానికి హౌరా-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. ఈ రైలు గయ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు అతడు ఉన్న బోగీలోకి ఎక్కారు.
వారిలో ఇద్దరు అతడి పక్కన కూర్చుని మాటలు కలిపారు. మాటల్లో తన వద్ద ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలను వారితో చెప్పాడు. దీంతో ఆ బంగారాన్ని కాజేయాలని ప్లాన్ చేశారు. ధనంజయ్ నిద్రపోతున్న సమయంలో అతడి బ్యాగులోని రూ.1.44 కోట్ల విలువైన కిలోకుపైగా బంగారు బిస్కెట్లను దొంగలించారు. నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత బ్యాగులో బంగారం కనిపించకపోవడంతో బాధితుడు పట్నా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. పట్నా రైల్వే ఎస్పీ నేతృత్వంలోని దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో రైల్వే అధికారుల కాల్ రికార్డింగ్స్‌ను దర్యాప్తు బృందం పరిశీలిస్తుండగా ఈ చోరీలో గయ రైల్వే పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ సింగ్, ఇతర సిబ్బంది హస్తం ఉన్నట్లు గుర్తించామని సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో రాజేష్ కుమార్ సింగ్‌ను బుధవారం అరెస్టు చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్టు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఇతర అధికారుల కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు.‘కరన్ కుమార్, అభిషేక్ చతుర్వేది, రంజన్‌జయ్ కుమార్, ఆనంద్ మోహన్, పర్వేజ్ అలమ్, రైల్వే పోలీస్ మాజీ డ్రైవర్ సీతారామ్ సహా పరారీలో ఉన్న ఇంత నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు’ అని ఆయన అన్నారు.
Latest News