|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:43 PM
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి కూటమి పార్టీల్లోకి చేరిపోయారు చాలా మంది నేతలు. తాజాగా నంద్యాల జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీని వీడారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి .. టీడీపీలో చేరిపోయారు. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ సోషల్ మీడియాలో పీవీ ప్రదీప్ రెడ్డి గతంలో పనిచేశారు. నంద్యాల పార్లమెంట్ వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జిగా వ్యవహరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అయితే ప్రదీప్ రెడ్డి పార్టీ మారటం.. శిల్పా రవికి షాక్ లాంటిందని రాజకీయ వర్గాలు భావిస్తు్న్నాయి. మరోవైపు నంద్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు పీవీ ప్రదీప్ రెడ్డి చెప్తున్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా నిజాయితీగా పనిచేస్తానని చెప్తున్నారు.
మరోవైపు ఏపీలో ఈ ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని అప్పటికి క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే మరో 15 ఏళ్ల పాటు వైసీపీని అధికారంలోకి రానివ్వమని చెప్తున్న చంద్రబాబు.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే కొత్తగా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారు. వివిధ సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని వీరిని నియమించారు. వీరి నేతృత్వంలో జిల్లాలలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
అందులో భాగంగా వైసీపీ నుంచి వచ్చే ద్వితీయ శ్రేణి నాయకులపైనా టీడీపీ ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను సైతం పార్టీలోకి చేర్చుకుంటోంది.
Latest News