ప్రయోగాలతో ఉప్పు నేలలో ఆక్వాకల్చర్,,,,తీర ప్రాంతాల్లో అధికంగా రొయ్యల సాగు
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:41 PM

ఉత్తర భారతంలో ఒకప్పుడు ఎలాంటి పంటల సాగుకు పనికిరాని ఉప్పు నెలలు ఇప్పుడు రొయ్యల పెంపకం కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి పనికిరావని భావించిన ఈ భూములు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సాంప్రదాయ పంటల స్థానంలో రొయ్యల పెంపకం రైతులకు అద్భుతమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లోనే రొయ్యల పెంపకం జరుగుతుంది. కానీ, ఉత్తర భారతదేశంలోని భూపరివేష్టిత రాష్ట్రాలైన హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌లలో కూడా ఈ పెంపకం విజయవంతంగా సాగుతోంది. ఎక్కడైతే ఉప్పు నీరు పంటలను నాశనం చేస్తుందో, అక్కడే ఇప్పుడు రొయ్యలు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. హర్యానా ఈ విషయంలో ముందుండగా.. రాజస్థాన్ వేగంగా దూసుకుపోతోంది. పంజాబ్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది.


ఈ విప్లవం 2009లో హర్యానాలోని రోహతక్ జిల్లా లహ్లి గ్రామంలో మొదలైంది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (CIFE) శాస్త్రవేత్తలు సహజంగా లభించే ఉప్పు నీటిలో సముద్ర రొయ్యలు మనుగడ సాగించగలవా? అని పరీక్షించారు. వారి అంచనాలను మించి ఫలితాలు వచ్చాయి. CIFE శాస్త్రవేత్త శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘ఆ విజయం హర్యానాలోని ఉప్పు భూముల్లో రొయ్యల పెంపకానికి నాంది పలికింది. 2014-15 నుంచి మేము రొయ్యల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ ఇచ్చి, వారి భూముల్లో నీటిని పరీక్షించి, సాంకేతికతను బదిలీ చేశాం’ అని తెలిపారు.


ప్రస్తుతం, హర్యానాలోని రోహతక్, ఝజ్జర్, హిసార్, సిర్సా, సోనిపట్ జిల్లాల్లో రొయ్యల పెంపకం జోరుగా సాగుతోంది. ఏటా 8,000 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తోంది. ఝజ్జర్‌కు చెందిన రైతు నేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇకపై క్షీణించిన భూమి గురించి మేము నిరాశ చెందే రోజులు పోయాయి’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.


రాజస్థాన్ కూడా ఈ అవకాశాన్ని వేగంగా అందిపుచ్చుకుంది. 2017లో చురు జిల్లాలోని ఇందసార్ గ్రామంలో రాజ్ కుమార్ పునియా మూడు చెరువులు తవ్వడంతో ఈ రొయ్యల విప్లవం మొదలైంది. ఇప్పుడు రాజ్‌గఢ్ తహసీల్ రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారింది. తారానగర్, సర్దార్‌షహర్, రత్న్‌గఢ్, సాలసార్‌తో పాటు శ్రీగంగానగర్, బికనీర్, నాగౌర్ జిల్లాలోనూ రొయ్యల సాగు విస్తరించింది. రవికాంత్ మైయా అనే రైతు మాట్లాడుతూ.. ‘గతంలో ఒక హెక్టార్‌ మిల్లెట్స్ (bajra) పంట ద్వారా రూ. 50,000 వచ్చేది.. ఈ రోజు, రొయ్యల పెంపకం ద్వారా నాకు సుమారు రూ. 12 లక్షలు వస్తున్నాయి’ అని తెలిపారు.


శ్రీగంగానగర్ వంటి ప్రాంతాల్లో కూడా కాలువ నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, గోధుమ, ఆవాలు, వేరుశెనగ వంటి సాంప్రదాయ పంటలను వదిలి రొయ్యల పెంపకం వైపు రైతులు మళ్లుతున్నారు. శ్రీగంగానగర్ రైతు సందీప్ భులార్ మాట్లాడుతూ.. రొయ్యల పెంపకం గోధుమ లేదా ఇతర పంటల కంటే ఎక్కువ లాభదాయకమని, నష్టభయం తక్కువని తెలిపారు.


పంజాబ్‌ 2016లో రొయ్యల పెంపకంలోకి ప్రవేశించింది. మలో‌త్‌లోని రత్తా ఖేడాలో లఖ్వీందర్ సింగ్ మొట్టమొదటిసారి రొయ్యల సాగు ప్రారంభించారు. తర్వాత ఫజిల్కా, శ్రీముక్తసర్ సాహిబ్, ఫరీద్‌కోట్, బఠిండా, మానస జిల్లాలకు ఇది విస్తరించింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దీనిని ప్రోత్సహించారు. ప్రస్తుతం, పంజాబ్ ఏటా సుమారు 2,400 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో విస్తారమైన ఉప్పు భూములు ఉన్నందున, ఇంకా ఎక్కువ ఉత్పత్తికి అవకాశం ఉంది. రైతులు రొయ్యల పెంపకం వైపు ఆకర్షితులవడానికి ప్రధాన కారణం దాని ఆర్థికంగా లాభదాయకం కావడమే.


నాలుగు నెలల కాలంలో ఎకరాకు 3 నుంచి 3.5 టన్నుల రొయ్యలు దిగుబడి అవుతాయి. ఖర్చులు పోను ఎకరాకు రూ. 8 లక్షల వరకు లాభాలు వస్తున్నాయి. ఇది మిల్లెట్స్ (bajra) వంటి పంటల ద్వారా వచ్చే రూ. 30,000తో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే, ఈ సాగులో పెట్టుబడి ఖర్చులు ఎక్కువ. ఒక చెరువుకు కనీసం రూ. 10-12 లక్షలు అవసరం. కేంద్ర ప్రభుత్వం చెరువు తవ్వకం, దాణా, విత్తనాలు, ఎరేటర్ల కోసం 40% (మహిళలకు 60%) సబ్సిడీ ఇస్తుంది. కానీ, ఈ సబ్సిడీలో జాప్యం వల్ల చాలామంది రైతులు పూర్తిగా దానిపై ఆధారపడటం లేదు.


రొయ్యల పెంపకంలో వ్యాధులు కూడా ఒక పెద్ద ప్రమాదం. వైట్ స్పాట్ సిండ్రోమ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఈ ఏడాదిలో హర్యానా, పంజాబ్‌లలోని ఫామ్‌లను దెబ్బతీశాయి. నీటి పరీక్షా కేంద్రాలు, వ్యాధి నియంత్రణ సౌకర్యాలు లేవు’ అని కన్సల్టెంట్ నితిన్ పిప్రాళియా తెలిపారు. రాజస్థాన్‌లో విద్యుత్ ఛార్జీలు (యూనిట్‌కు రూ. 13) కూడా ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ప్రభుత్వం దీనిని వ్యవసాయ అనుబంధగా కాకుండా వాణిజ్య కార్యకలాపంగా పరిగణించడంతో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ప్రభావం చూపుతాయి.


సాగు ఇంతలా విజయవంతమైనప్పటికీ విత్తనాలు, దాణా కోసం మాత్రం తీర ప్రాంత రాష్ట్రాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. హ్యాచరీలకు సముద్రపు నీరు అవసరం కాబట్టి, సరఫరా గొలుసులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి వస్తున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన మధ్యవర్తులు చాలా వరకు ఇన్‌ల్యాండ్ రొయ్యలను కొనుగోలు చేసి ఎగుమతిదారులకు అమ్ముతారు.


పిప్రాళియా ప్రకారం.. ఇప్పుడున్న సవాలు స్థానికంగా వ్యాధి నిఘా, దాణా ఫ్యాక్టరీలు చౌకగా విద్యుత్ పంపిణీ వంటి వ్యవస్థలను నిర్మించడం. ఇది జరిగితే, ఉత్తర భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రొయ్యల ఉత్పత్తికి ఒక ప్రత్యేకమైన నమూనాగా నిలుస్తుంది.

Latest News
NTR changed the course of history: CM Chandrababu Naidu Sun, Jan 18, 2026, 02:52 PM
Six killed as fire erupts at shopping mall in Pakistan's Karachi Sun, Jan 18, 2026, 02:48 PM
Amway India's loss widens to Rs 74.25 crore in FY25 Sun, Jan 18, 2026, 02:03 PM
Anti-BJP posters appear in Singur, ahead of PM Modi's public meeting Sun, Jan 18, 2026, 01:54 PM
Flash flooding, landslides prompt evacuations in Sydney Sun, Jan 18, 2026, 01:51 PM