|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:46 PM
అస్సాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న తేయాకు తోటల కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దిశగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా తోటల్లోనే బతుకుతున్న లక్షలాది మంది కార్మికులకు భూమి యాజమాన్య హక్కులు (పట్టాలు) కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని వ్యతిరేకిస్తున్న టీ ఎస్టేట్ యాజమాన్యాలకు ముఖ్యమంత్రి గురువారం గట్టి హెచ్చరిక జారీ చేశారు.
బానిసత్వం నుంచి గౌరవప్రదమైన జీవితం వైపు..
"బ్రిటిష్ కాలంలో టీ కార్మికులను అస్సాంకు తీసుకువచ్చినప్పుడు వారిని బానిసలుగా చూశారు. కాలక్రమేణా చట్టాలు వారికి మానవత్వాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పటికీ ఆత్మగౌరవాన్ని ఇవ్వలేదు. నేడు ఆ చారిత్రక తప్పిదాన్ని మేము సరిదిద్దుతున్నాం" అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. కార్మికులకు భూమి హక్కులు కల్పించే ప్రక్రియకు అడ్డుపడితే.. టీ ఎస్టేట్లకు ప్రభుత్వం అందజేస్తున్న రూ. 150 కోట్ల విలువైన రాయితీలను వెంటనే ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
2025 నవంబర్‌లో అస్సాం అసెంబ్లీ ఆమోదించిన 'అస్సాం ఫిక్సేషన్ ఆఫ్ సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్ సవరణ బిల్లు'కు గవర్నర్ ఆమోదం ముద్ర వేశారు. దీని ప్రకారం.. తోటల్లోని 'లేబర్ లైన్లలో' నివసిస్తున్న కార్మికులకు వారు నివసిస్తున్న భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తాయి. అలాగే ఈ భూమిని మొదటి 20 ఏళ్ల వరకు విక్రయించడానికి వీళ్లేదు. 20 ఏళ్ల తర్వాత కూడా కేవలం మరో టీ కార్మికుల కుటుంబానికి మాత్రమే దీనిని అమ్మాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల 825 టీ ఎస్టేట్లలోని సుమారు 3,33,486 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
మరోవైపు ప్లాంటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951 ప్రకారం కార్మికుల క్వార్టర్లు ఎస్టేట్ సౌకర్యాల్లో భాగమని, వాటిని వ్యక్తిగత ఆస్తులుగా మార్చడం చట్టరీత్యా సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కార్మికుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని భీష్మించుక కూర్చుంది. రాబోయే మూడు నెలల్లోనే అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీ తోటల కార్మికులు రాష్ట్రంలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. 2016 నుంచి వీరు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. తాజాగా భూమి హక్కుల కల్పన ద్వారా వారి మద్దతును మరింత సుస్థిరం చేసుకోవాలని అధికార పక్షం భావిస్తోంది.