|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:47 PM
మధ్యప్రదేశ్‌లోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచిన ఇండోర్ ఇప్పుడు తాగునీటి కాలుష్యంతో వణికిపోతోంది. నగరంలోని భగీరథ్‌పుర ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా కావడంతో వందలాది మంది అస్వస్థతకు గురవ్వడం, పలువురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో క్షేత్ర పర్యటనకు వచ్చిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ జర్నలిస్టుల పట్ల ప్రవర్తించిన తీరు కొత్త వివాదానికి తెరలేపింది.
మంత్రి దురుసు ప్రవర్తన.. ఆపై విచారం
కలుషిత నీటి ప్రభావానికి గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి విజయ్ వర్గీయను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల బిల్లులను ప్రభుత్వం ఎందుకు రీయింబర్స్ చేయడం లేదని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. మంత్రి సహనం కోల్పోయారు. "ఇలాంటి పనికిరాని ప్రశ్నలు అడగవద్దు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. పరిస్థితిని గమనించిన మంత్రి.. వెంటనే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు.
ఈ విషాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంలో ప్రభుత్వం, స్థానికుల మధ్య పొంతన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సుమారు 13 మంది చనిపోయారని స్థానికులు చెబుతుండగా.. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాత్రం నలుగురే చనిపోయారని పేర్కొన్నారు. మరోవైపు మేయర్ పుష్యమిత్ర భార్గవ ఏడుగురు అని పేర్కొన్నారు. మంత్రి విజయ్ వర్గీయ మాత్రం నలుగురు మరణించినట్లు సమాచారం ఉందని.. స్థానికులు చెబుతున్న 8 నుంచి 9 మరణాల సంఖ్యపై విచారణ జరిపిన తర్వాతే పరిహారం అందజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 1,400 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దారుణానికి గల కారణాన్ని అధికారులు వెల్లడిస్తూ దిగ్భ్రాంతికి గురిచేశారు. తాగునీటి పైపులైన్లలోకి టాయిలెట్ నీరు కలవడం వల్లే ఈ కాలుష్యం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాధవ్ ప్రసాద్ వివరించారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం పైపులైన్లను మరమ్మతు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజల్లో మాత్రం భయం నీడలు తొలగిపోలేదు.
Latest News