|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:50 PM
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో రాజకీయ శత్రుత్వం మరోసారి రోడ్డెక్కింది. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో మొదలైన చిన్న వివాదం కాస్తా కాల్పులకు దారితీసి.. ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఈ భీకర ఘర్షణతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బ్యానర్ల రగడ.. రాళ్ల దాడి!
శనివారం జరగనున్న వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం భరత్ రెడ్డి అనుచరులు పట్టణం అంతా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే జనార్ధన రెడ్డి ఇంటి ముందు కూడా బ్యానర్లు కట్టేందుకు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. దీనిని జనార్ధన రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి.. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలోనే భరత్ రెడ్డి సన్నిహితుడు, మాజీ మంత్రి సతీష్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ గందరగోళంలో సతీష్ రెడ్డి గన్‌మెన్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడం సంచలనం రేపింది.
ఒకరి మృతి.. పరస్పర ఆరోపణలు
ఈ అల్లర్లలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై జనార్ధన రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ.. తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. "నేను కారు దిగగానే నాపై కాల్పులు జరిపారు. భరత్ రెడ్డి వర్గం నేరగాళ్లను వెంటేసుకుని నన్ను అంతం చేయాలని చూస్తోంది" అని మండిపడ్డారు. మరోవైపు భరత్ రెడ్డి ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. బ్యానర్లు బహిరంగ ప్రదేశాల్లోనే కట్టామని, వాల్మీకి సమాజం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే జనార్ధన రెడ్డి వర్గం హింసకు పాల్పడుతోందని, రాజశేఖర్ మృతికి వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి పోలీసులు.. 144 సెక్షన్ విధింపు..
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెల్లాచెదురు చేయడానికి స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. బీజేపీ నేత శ్రీరాములు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు బళ్లారిలో భారీగా మోహరించారు. అలాగే అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది కూడకూడదని ఆంక్షలు విధించారు. అయితే రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో.. ఒక సామాన్య కార్యకర్త ప్రాణం పోవడంతో జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. ముఖ్యంగా అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Latest News