|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:10 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు రూ.2.93 లక్షల కోట్ల అప్పులు చేసి, ఆ డబ్బును బినామీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో దోచుకున్న ప్రజాధనాన్ని విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చేందుకు తండ్రీ–కొడుకులు చంద్రబాబు, లోకేష్ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లారని విమర్శించారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా పర్యటనలు చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆచూకీ కనబడటం లేదంటూ సోషల్ మీడియాలో ప్రజలు పోస్టులు పెడుతున్నారని తెలిపారు.గత నాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచూకీ తెలియకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని కారుమూరి వెంకటరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ‘సీఎం ఎక్కడ?’ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయని చెప్పారు. సీఎం ఆచూకీపై రాష్ట్ర డీజీపీ, సీఎస్ వద్ద సమాచారం ఉంటే వెంటనే ప్రజలకు వెల్లడించాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అయినా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.సీఎంతో పాటు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ కూడా గత వారం రోజులుగా కనిపించకుండా పోయారని విమర్శించారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా టీడీపీ కార్యకర్తలు లోకేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారని అన్నారు. ఎల్లో మీడియా మాత్రం లండన్, బాలి వంటి పలు దేశాల పేర్లు చెబుతున్నా, ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.
Latest News