|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:10 PM
ప్రజలకు కనీస సమాచారమివ్వకుండానే విదేశీ పర్యటలకు వెళ్ళిన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తీరుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఆక్షేపించారు. కాకినాడలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేష్ ల రహస్య విదేశీ పర్యటన ప్రజలను గందరగోళంలోకి నెట్టిందని మండిపడ్డారు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ... తమ పర్యటన వివరాల్లో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీశారు. సీఎం హోదాలో తన కుమార్తెను చూడ్డానికి లండన్ వెళ్లిన వైయస్.జగన్ పై లోకేష్ చేసిన దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారికంగా సమాచారమిచ్చినా చౌకబారు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇవాళ మీ తండ్రీకొడుకుల పర్యటన వివరాలెందుకివ్వలేదని నిలదీశారు. పర్యటన ఏదైనా బాధ్యతగల సీఎం, మంత్రిగా ఎందుకు సమాచారమివ్వలేదని ప్రశ్నించారు. ఒకవైపు బాబు లండన్ పర్యటన అంటూ మీడియాకు లీకులిస్తుంటే.. బాలికి బాబు ప్రయాణం అని జరుగుతున్న ప్రచారం ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని ఆక్షేపించారు. 18 నెలల్లో కూటమి పాలనలో రికార్డు స్ధాయి అప్పులు చేశారని.. 5 ఏళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే.. 18 నెలల బాబు పాలనలో ఏకంగా రూ. 2.93 లక్షల కోట్ల అప్పు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మీరు చేస్తామన్న సంపద సృష్టి ఏమైందని ప్రశ్నించిన కన్నబాబు... బాబు పాలనలో వృద్ధి రేటుకి, జీఎస్టీ ఆదాయానికి పొంతన కుదరడం లేదని తేల్చి చెప్పారు.
Latest News