|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:21 PM
ఏఐ రాకతో న్యాయవ్యవస్థలో పెనుమార్పులు రానున్నాయని, అయితే దీని వినియోగంపై న్యాయ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ అన్నారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల జడ్జీలు, న్యాయవాదుల సృజనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనా ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."ఇప్పటివరకు వచ్చిన టెక్నాలజీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడింది. కానీ, ఏఐ మన ఆలోచనా ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టెక్నాలజీ మనకు సహాయపడాలి కానీ, మనం దానికి సహాయపడేలా ఉండకూడదు. మన విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను కాపాడుకుంటూ ఏఐ కన్నా ఒక అడుగు ముందుండాలి" అని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవాదులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ నరసింహ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కక్షిదారులు కూడా ఎంతో అవగాహనతో ఉంటున్నారని, వారి అంచనాలకు తగ్గట్టుగా న్యాయ సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత లాయర్లపై ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తుల కోసం ఉన్న జ్యుడీషియల్ అకాడమీ తరహాలోనే న్యాయవాదుల కోసం కూడా ఒక శాశ్వత లీగల్ అకాడమీని ఏర్పాటు చేయాలని జస్టిస్ నరసింహ ప్రతిపాదించారు.
Latest News