|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:04 PM
రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలోనూ స్టేడియం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆధ్యా్త్మిక నగరం తిరుపతిలో క్రీడారంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తిరుపతిలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ నిర్మిస్తోంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో ఈ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తున్నారు.
రూ.5 కోట్ల వ్యయంతో తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన శాప్ ఛైర్మన్ రవి నాయుడు.. తిరుపతిలో జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటియాలా తర్వాత తిరుపతిలోని స్పోర్ట్స్ అకాడమీ సమగ్ర శిక్షణ కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. 200 మంది క్రీడాకారులకు వసతి కల్పించేలా వసతి గృహం, జాతీయ ప్రమాణాలతో వెయిట్ లిఫ్టింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, బ్యాడ్మింటన్, జూడో, లాన్ టెన్నిస్, చెస్ వంటి ఆటల కోసం ఇండోర్, అవుట్ డోర్ సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ నాటికి ఈ అకాడమీని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
మరోవైపు క్రీడారంగం అభివృద్ధికి, యువ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసే మల్టీ స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ.. ఆధునిక వసతులతో, ప్రొఫెషనల్ కోచింగ్‌తో సమగ్ర శిక్షణ అందిస్తుందని రవి నాయుడు వివరించారు. రాష్ట్రం నుంచి భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేసేందుకుఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీ జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు.
మరోవైపు తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. దామినేడులో భూమిని కూడా కేటాయించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28.37 ఎకరాల భూమిని శాప్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఆధ్మాత్మిక నగరం తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Latest News