యువ టెక్కీలకు బంపరాఫర్.., టాప్ 5 విజేతలకు లక్షల్లో నగదు బహుమతి
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:04 PM

దేశంలోని డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, వినూత్న ఆలోచనలు ఉన్న యువతకు భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఆధార్ వ్యవస్థను మరింత మెరుగు పరచడానికి, డేటా ఆధారిత విశ్లేషణల ద్వారా సరికొత్త పరిష్కారాలను కనుగొనడానికి 'నేషనల్ డేటా హ్యాకథాన్' వేదిక కానుంది. ఈ పోటీలో తమ ప్రతిభను చాటిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీగా నగదు బహుమతులను ప్రకటించింది.


హ్యాకథాన్ లక్ష్యం ఏమిటి?


భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వద్ద ఉన్న భారీ డేటాను విశ్లేషించి.. ప్రజలకు అందుతున్న సేవలను మరింత సులభతరం చేయడం, భద్రతను పెంచడం, సాంకేతిక లోపాలను సరిదిద్దడం వంటి అంశాలపై వినూత్న 'ఇన్సైట్స్' సేకరించడమే ఈ హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశ్యం. అభ్యర్థులు ఇచ్చే డేటా ఆధారిత సూచనలు భవిష్యత్తులో ఆధార్ సేవల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాకథాన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ఐదు ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లతో పాటు ఆకర్షణీయమైన నగదు బహుమతులను అందజేయనుంది.


 అందులో మొదటి బహుమతికి రూ. 2,00,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. ద్వితీయ బహుమతికి రూ. 1,50,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే తృతీయ బహుమతికి రూ. 75,000, నాల్గవ బహుమతికి రూ. 50,000, ఐదవ బహుమతికి రూ. 25,000 అందించనున్నారు. నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు లభించడం వల్ల యువ ప్రొఫెషనల్స్ కెరీర్‌కు ఈ హ్యాకథాన్ ఉపయోగపడనుంది.


ఎప్పుడు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..?


ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలనుకుంటున్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 5వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు, నిపుణులు, స్టార్టప్ టీమ్‌లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఆసక్తి గల అభ్యర్థులు నిబంధనలు, అర్హతలు, డేటా సెట్ల వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ event.data.gov.in ను సందర్శించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన వెంటనే గడువు ముగిసేలోపు మీ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.


సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను కనిపెట్టడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని, ఈ హ్యాకథాన్ ద్వారా సరికొత్త మేధావులను వెలికితీస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. డేటా అనలిటిక్స్ పట్ల మక్కువ ఉన్నవారు వెంటనే ఈ హ్యాకథాన్ కోసం రెడీ అయిపోండి. అన్నీ సిద్ధం చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి.

Latest News
Trump says Venezuela talks 'working out well' Mon, Jan 12, 2026, 03:05 PM
BSE warns investors about fake deepfake video misusing CEO's identity Mon, Jan 12, 2026, 02:23 PM
Indian households turn investors, bank deposits surge: SBI report Mon, Jan 12, 2026, 01:51 PM
HinduACTion plans Capitol Hill briefing on minorities Mon, Jan 12, 2026, 01:43 PM
Police suspect sexual assault in B'luru techie murder case Mon, Jan 12, 2026, 01:13 PM