|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:19 PM
వెనుజులా రాజధానిపై భారీ ఎత్తున వైమానిక దాడులు చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వెనుజులా రాజధాని కారకాస్‌లో భారీ శబ్దాలతో పేలుళ్లు జరిగాయనే నివేదికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.మదురోను అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్నాడని అమెరికా ఆరోపిస్తోంది. అయితే, మదురో ఈ ఆరోపణలను ఖండించారు. వెనిజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయని, అందుకే అమెరికా తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తోందని ఆయన అంటున్నారు.
మదురోను పట్టుకున్నా లేదా దోషిగా తేల్చినట్టు సమాచారం అందించిన వారికి 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.450 కోట్లు) వరకు బహుమతి ఇస్తామని అమెరికా గతేడాది ప్రకటించింది. ఇది అమెరికా 'నార్కోటిక్స్ రివార్డ్స్ ప్రోగ్రామ్' కింద ప్రకటించిన అత్యధిక బహుమతి. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై మరింత ఫోకస్ పెట్టారు. 2013లో హ్యూగో చావెజ్ మరణానంతరం మదురో అధికారంలోకి వచ్చారు. అయితే, 2019 నుంచి ఆయన నాయకత్వంపై అంతర్జాతీయంగా వివాదాలున్నాయి. అధికారాన్ని అక్రమంగా చేజిక్కించుకున్నాడని వెనుజులా నేషనల్ అసెంబ్లీ ప్రకటించింది. అమెరికాతో సహా 50కి పైగా దేశాలు మదురోను చట్టబద్ధమైన నాయకుడిగా గుర్తించడం లేదు. 2024 జూలైలో జరిగిన వివాదాస్పద ఎన్నికల్లో మదురో గెలుపును కూడా అమెరికా తిరస్కరించింది.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం... మదురో 'కార్టెల్ ఆఫ్ ది సన్స్' అనే డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపణలున్నాయి. ఈ సంస్థలో వెనిజులాలోని ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. మదురో, కొలంబియాలోని FARC తిరుగుబాటుదారులతో కలిసి భారీ మొత్తంలో కొకైన్‌ను తరలించాడని, ఆయుధాలు సరఫరా చేశాడని, మధ్య అమెరికా ద్వారా రవాణా మార్గాలను సులభతరం చేశాడని, సాయుధ మిలీషియా గ్రూపులకు మద్దతు ఇచ్చాడని అమెరికా ఆరోపిస్తోంది.
మార్చి 2020లో న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టులో మదురోపై నార్కో-టెర్రరిజం, కొకైన్ రవాణా కుట్ర, ఆయుధ సంబంధిత నేరాల అభియోగాలు నమోదయ్యాయి. తొలిసారి 2020లో 15 మిలియన్ డాలర్లు రివార్డు ప్రకటించగా, జనవరి 2025లో దానిని 25 మిలియన్ డాలర్లకు పెంచారు. గతేడాది జులైలో 'కార్టెల్ ఆఫ్ ది సన్స్'ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన తర్వాత, బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచడం గమనార్హం. స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఈ ప్రోగ్రామ్ చరిత్రలో 25 మిలియన్ డాలర్లకు మించిన రివార్డు ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ మొదటి వ్యక్తి మదురోనే.