|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:09 PM
మూడున్నరేళ్ల కిందట గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌లో ఎనిమిది భారత నౌకాదళ మాజీ అధికారులు అరెస్టై, ఆ దేశ పాలకుడి క్షమాభిక్షతో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలు నుంచి విడుదలైన ఎనిమిది మందిలో ఏడుగురు స్వదేశానికి రాగా.. ఒకర్ని మళ్లీ కొత్త కేసులో అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన రిటైర్డ్ కమాండర్ పుర్ణేందు తివారీ (65) ప్రస్తుతం దోహా జైల్లోనే ఉన్నారు. దీంతో ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన కుటుంబసభ్యులు కోరారు. పుర్నేందు తివారీ సోదరి డాక్టర్ మీతూ భార్గవ.. తక్షణమే జోక్యం చేసుకుని తన సోదరుడ్ని విడుదలకు ప్రయత్నాలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 2022లో గూఢచర్యం ఆరోపణలపై తివారీ సహా 8 మందిని ఇండియన్ నేవీ మాజీ అధికారులను ఖతార్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరణశిక్ష విధించడం అప్పట్లో అంతర్జాతీయంగా కలకలం రేగింది. కానీ, చివరకు, కేంద్రం దౌత్య మార్గాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారి మరణశిక్షను ఖతార్ పాలకులు రద్దు చేసి.. జైలు శిక్షగా మార్చారు. అనంతరం ఫిబ్రవరి 2024లో ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమా్ అల్-తానీ క్షమాభిక్షను ప్రసాదించారు. దీంతో ఏడుగురు అధికారులు జైలు నుంచి రిలీజ్ అయి గతేడాది భారత్‌కు తిరిగి వచ్చారు. కానీ, పుర్ణేందు తివారీపై మాత్రం పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణల కేసు ఉంది. ఆయన దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఈ కేసులో ఆయనపై ట్రావెల్ బ్యాన్ ఉండటం వల్ల అక్కడే చిక్కుకుపోయారు.
ఈ కేసు ఆధారంగానే కుట్రపూరితంగా మరో కేసును సృష్టించారని, అన్యాయంగా తన సోదరుడికి ఆరేళ్ల జైలు శిక్ష విధించారని డాక్టర్ మీతూ భార్గవ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వాపోయారు. గత నెల రోజుల నుంచి జైల్లో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ నిర్లక్ష్యం వల్లే తన సోదరుడికి ఈ దుస్థితి వచ్చిందని ఆమె ఆరోపించారు. దీర్ఘకాలం ఏకాకిగా ఉండటంతో తివారీ ఆరోగ్యం క్షీణించిందని, బీపీ, డయాబెటిస్, పీటీఎస్డీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో నేవీ ఉన్నతాధికారులు కూడా మౌనంగా ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే మాట్లాడటానికి అవకాశం వచ్చిందన్నారు.
Latest News