కడుపులో కత్తెర... , ఆపరేషన్ చేయగా అనంత లోకాలకు
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:07 PM

బీహార్‌లోని మోతిహారీ జిల్లాలో వైద్య రంగం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. ముఖ్యంగా పాతికేళ్ల మహిళ గతేడాది గర్భం దాల్చగా.. ఆమెను కాన్పు కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కేడ సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు.. తల్లి కడుపులోనే సర్జికల్ కత్తెరను వదిలేశారు. ఆ విషయం మర్చిపోయి మరీ కుట్లు కూడా వేసేశారు. అయితే 18 నెలలుగా విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతున్న ఆమె.. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇటీవలే స్కానింగ్‌లో ఈ విషయం వెలుగులోకి రాగా.. వెంటనే శస్త్ర చికిత్స చేశారు. కానీ అప్పటికే ఆ కత్తెర ఆమె కడుపులోని పేగులను చీల్చేసింది. ఫలితంగా ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె ప్రాణాలు కోల్పోయింది.


ప్రసవం కోసం వెళ్తే.. ప్రాణ సంకటంగా మారింది!


బాధితుల కథనం ప్రకారం.. బీహార్‌లోని మోతిహారీ జిల్లాకు చెందిన మణిభూషణ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. వివాహమైన కొంత కాలానికే 25 ఏళ్ల భార్య ఉషాదేవి గర్భం దాల్చగా అంతా మురిసిపోయారు. నెలలు నిండే వరకు ఆమెను చక్కగా చూసుకున్నారు. తమది పేద కుటుంబమే అయినా మంచి వైద్యం ఇప్పించాలని భావించిన మణిభూషణ్ కుమార్.. ఆమెను 18 నెలల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే డాక్టర్ సంగీత కుమారి ఆధ్వర్యంలో ఆమెకు సిజేరియన్ నిర్వహించగా.. ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆపరేషన్ ముగిసే సమయంలో అత్యంత అజాగ్రత్తగా వ్యవహరించిన సదరు వైద్యురాలు.. సర్జికల్ కత్తెరను ఉషాదేవి కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు.


  ఏడాదిన్నర పాటు నరకం..


శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఉషాదేవికి తరచుగా కడుపు నొప్పి వస్తూనే ఉంది. అనేక మార్లు వివిధ ఆసుపత్రులకు తిరిగినా.. అక్కడి వైద్యులు కేవలం 'పెయిన్ కిల్లర్లు' ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ ఏ ఒక్కరు కూడా అసలు నిజాన్ని గుర్తించలేకపోయారు. గత కొద్ది రోజులుగా నొప్పి భరించలేనంత తీవ్రంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిటీ స్కాన్ నిర్వహించగా.. కడుపులో ఒక పెద్ద కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసి వైద్యులతో పాటు కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు.


పేగులు చీరుకుపోయి.. తుదిశ్వాస విడిచి


పరిస్థితి విషమించడంతో బాధితురాలిని వెంటనే రెహమానియా మెడికల్ సెంటర్‌కు తరలించి అత్యవసర శస్త్రచికిత్స ప్రారంభించారు. అయితే అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. కడుపులో ఉన్న కత్తెర కారణంగా ఉషాదేవి పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లోపల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో.. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. శస్త్రచికిత్స జరుగుతుండగానే ఆమె మరణించింది.


ఒక చిన్నారికి తల్లిని దూరం చేసిన డాక్టర్ సంగీత కుమారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది పొరపాటు కాదని.. ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వైద్యురాలిపై హత్యకేసు నమోదు చేసి శిక్షించాలని గ్రామస్థులు, బంధువులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలాంటి ఘోర తప్పిదానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Latest News
Trump says Venezuela talks 'working out well' Mon, Jan 12, 2026, 03:05 PM
BSE warns investors about fake deepfake video misusing CEO's identity Mon, Jan 12, 2026, 02:23 PM
Indian households turn investors, bank deposits surge: SBI report Mon, Jan 12, 2026, 01:51 PM
HinduACTion plans Capitol Hill briefing on minorities Mon, Jan 12, 2026, 01:43 PM
Police suspect sexual assault in B'luru techie murder case Mon, Jan 12, 2026, 01:13 PM