|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:56 PM
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆఖరి నిమిషం వరకు ఏ ప్లేయర్‌కి ఛాన్స్ ఇస్తారో? ఎవరికి హ్యాండ్ ఇస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ప్లేయర్లకు మాత్రం మొండిచేయే మిగిలింది. సౌతాఫ్రికా సిరీస్‌లో సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మొత్తం 15 మందితో కూడిన జట్టులో కొత్త మొహాలు ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు.
రిషభ్ పంత్ విషయంలో ఆఖరి వరకు తర్జనభర్జన పడ్డ సెలెక్షన్ కమిటీ సంజు శాంసన్‌ని తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ, వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని పంత్‌నే బ్యాకప్ వికెట్ కీపర్‌గా సెలెక్ట్ చేశారు. మెయిన్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ పేరునే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించడంతో పంత్‌కి ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమే అని చెప్పొచ్చు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ కోలుకున్నప్పటికీ బరువు తగ్గాడు అన్న కారణంతో పక్కనపెడతారు అనుకున్నారు కానీ.. అప్పటికి పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకం ఉండటంతో అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సౌతాఫ్రికా సిరీస్‌లో అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్ నిరాశే ఎదురైంది.
ఇటీవల కాలంలో టీమిండియా వన్డే స్క్వాడ్‌లో ఆల్‌రౌండర్ కోటాలో చోటు సంపాదించుకుంటన్న నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. టెస్టు, వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటున్న నితీష్.. చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా నితీష్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించకపోతే నితీష్‌కి అవకాశాలు సన్నగిల్లే ఛాన్స్ ఉంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో టాప్ ఆర్డర్ బలంగా ఉండటం ఓపెనర్‌గా గిల్, మిడిలార్డర్‌లో అయ్యర్, కేఎల్ రాహుల్ రాణిస్తుండటంతో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు దక్కలేదు. దేశవాళీ ట్రోఫీల్లో సక్సెస్ అయిన మొహమ్మద్ షమీకి ఛాన్స్ ఇస్తారనుకున్నా మళ్లీ మొండిచేయే మిగిలింది. సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌కి ప్లేస్ దక్కింది. జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
టీమిండియా స్క్వాడ్ ఇదే
శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
Latest News