|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 07:53 AM
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ తనను జట్టు నుంచి తొలగించడంపై బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలిసారి స్పందించాడు.జట్టు నుంచి పక్కన పెట్టినప్పుడు అంతకంటే చేసేదేముంటుంది అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. మైదానం వెలుపల జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాల వల్ల ఒక స్టార్ ఆటగాడు సీజన్‌కు ముందే ఇంటికి వెళ్లాల్సి రావడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడనివ్వకూడదని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కోల్‌కతాలో ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా అతడిని రిలీజ్ చేయాలని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఫ్రాంచైజీని ఆదేశించారు.నిజానికి ముస్తాఫిజుర్ తన కెరీర్ లోనే అత్యధిక ధరకు ఈసారి అమ్ముడుపోయాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఐపీఎల్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ, దౌత్యపరమైన చిక్కుల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ముస్తాఫిజుర్ నిష్క్రమణతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, అతడి స్థానంలో మరో విదేశీ ఆటగాడిని ఎంచుకునేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మరోవైపు, ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని, ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని అక్కడి క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించడం గమనార్హం.
Latest News