|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 05:56 PM
మనిషికి ప్రాణాధారం నీరు. తిండి లేకుండా అయినా కొన్ని రోజులు జీవించగలరేమో కానీ.. నీరు లేకుండా అంటే అసాధ్యమనే చెప్పాలి. అలాంటి నీరు కూడా కల్తీ అవుతున్న పరిస్థితి. ఆర్వో ప్లాంట్ల నుంచి మంచి నీరు వాటర్ క్యాన్లలో తెచ్చుకుంటున్నప్పటికీ.. అవెంత వరకూ శుద్ధమైనవనేదీ దేవుడికే తెలియాలి. అయితే ఇలాంటి కష్టాలు లేకుండా నీటిని పరీక్షించే ల్యాబ్ మీకు అందుబాటులో ఉంటే.. అది కూడా మీ ఇంటి వద్దకే వస్తే.. వావ్, సూపర్ అనిపిస్తోంది కదా.. ఇలాంటి సౌకర్యం త్వరలోనే విశాఖపట్నం వాసులకు అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి రానుంది.
విశాఖపట్నం నీటి సరఫరా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల ద్వారా రూ. 40 లక్షల ఖర్చుతో ఈ ల్యాబ్-ఆన్-వీల్స్‌ను కొనుగోలు చేసింది. ఈ ల్యాబ్ సాయంతో నీటిలోని హానికరమైన లోహాలు, బ్యాక్టీరియా, క్లోరిన్ స్థాయిలు, టర్బిడిటీ, కాఠిన్యాన్ని పరీక్షించవచ్చు. అలాగే శిక్షణ పొందిన కెమిస్టులు ఇందులో అందుబాటులో ఉంటారు. విశాఖపట్నంలోని అన్ని వార్డులను ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలోని నీటిని అక్కడికక్కడే పరీక్ష నిర్వహిస్తారు. ఈ ల్యాబ్‌లోని పరికరాలను ఉపయోగించి నీటి నాణ్యతను శాస్త్రీయంగా విశ్లేషించడానికి నిపుణులైన కెమిస్టులు మొబైల్ ప్రయోగశాలలో అందుబాటులో ఉంటారు.
మరోవైపు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పరిశీలించారు. పౌరులకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ఈ అధునాతన మొబైల్ ప్రయోగశాలను ప్రవేశపెట్టడం గర్వకారణమని జీవీఎంసీ కమిషనర్ అన్నారు. ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో.. స్పెక్ట్రోఫోటోమీటర్, టర్బిడిటీ మీటర్, డిజిటల్ టైట్రేటర్‌తో సహా ఏడు అధునాతన పరీక్షా పరికరాలు ఉన్నాయని వివరించారు. ఈ పరికరాలు హానికరమైన లోహాలు, బ్యాక్టీరియా, క్లోరిన్ స్థాయిలు, నీటి కాఠిన్యాన్ని తక్షణమే గుర్తించడానికి వీలు కల్పిస్తాయని తెలిపారు.
మరోవైపు కలుషిత నీటి వల్ల కలిగే అతిసారం, టైఫాయిడ్ వంటి వ్యాధులను నియంత్రించడంలో ఇలాంటి పరీక్షలు ఎంతో సహాయపడతాయని జీవీఎంసీ కమిషనర్ అన్నారు. అనంతరం ఈ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వాహనాన్ని అధికారికంగా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత DMHO అధికారులు ఈ వాహనాన్ని.. GVMC తాగునీటి సరఫరా విభాగానికి అప్పగించారు.