|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 07:32 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఉదంతంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నికోలస్ మదురోను అమెరికా బలగాలు ఆ దేశం నుంచి ఎలాగైతే బంధించి తీసుకెళ్లాయో.. అదే రీతిలో భారత్ కూడా పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దళాలను పంపి వెనిజులా అధ్యక్షుడిని పట్టుకోగలిగితే.. ప్రధాని మోదీ గారు మీరు కూడా పాకిస్తాన్‌లోకి సైన్యాన్ని పంపి 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్‌మైండ్ ఉగ్రవాదులను భారత్‌కు ఎందుకు తీసుకురాలేరని ఆయన ప్రశ్నించారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు లేదా జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ వంటి దుర్మార్గులను పాకిస్తాన్ నుంచి భారత్‌కు లాక్కొచ్చే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా అని ఓవైసీ నిలదీశారు.
గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదాన్ని గుర్తు చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ట్రంప్ అంతటి వారు ఇలాంటి పని చేయగలిగితే.. మీరు తక్కువ కాదు కదా.. ఆయన చేయగలిగితే మీరు కూడా చేసి చూపించాలి అంటూ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. 2008లో జరిగిన 26/11 దాడుల్లో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసిన ఓవైసీ.. ఆ మారణహోమానికి కారకులైన వారు ఇంకా పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరగడంపై ఆయన మండిపడ్డారు.
Latest News