|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 07:33 PM
ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్‌లో ఆరు ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. టెర్రస్ పైనుంచి విసిరేసి చంపిన ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి.. అనంతరం అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నిందితులు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘోర కలిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సత్వర విచారణ చేస్తున్నారు.
బులంద్‌షహర్ జిల్లాలోని సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఈ అత్యంత అమానవీయ ఘటన.. తీవ్ర సంచలనంగా మారింది. సికింద్రాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్న బాధితురాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు రాజు, వీరు అదే బిల్డింగ్‌లో అద్దెకు ఉంటున్నారు. బాలిక టెర్రస్ మీద ఆడుకుంటున్న సమయంలో నిందితులు ఆమెపై కన్నేశారు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత.. ఆ విషయం బయటికి వస్తుందని భయపడిన ఆ ఇద్దరు నిందితులు.. ఆమెను టెర్రస్ పైనుంచి కిందకు విసిరేశారు.
దీంతో ఆ బాలిక తీవ్ర గాయాలతో పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్‌లో పడిపోయింది. అప్పుడు ఆ చిన్నారిని గుర్తించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బులంద్‌షహర్ పోలీసులు.. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కన్వారా రోడ్ వద్ద నిందితులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు.
పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో రాజు, వీరు ఇద్దరికీ కాళ్లపై గాయాలయ్యాయి. గాయపడిన నిందితులను వెంటనే ఆస్పత్రికి తరలించి.. అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో మరిన్ని సెక్షన్లను చేర్చి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ డాక్టర్ తేజ్వీర్ సింగ్ తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Latest News