|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 08:12 PM
ఒక సాధారణ లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. వెనిజులాలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదిగిన సిలియా ఫ్లోరస్.. ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్, నార్కో టెర్రరిజం కేసులో ఆమె పూర్తిగా ఇరుక్కుపోయారు. తన కుటుంబం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను అక్రమంగా పంపించారనే ఆరోపణలతో సిలియా ఫ్లోరస్ న్యూయార్క్ కోర్టులో విచారణను ఎదుర్కొనున్నారు. ఇక సిలియా ఫ్లోరస్‌పై అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రధానంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు అభియోగాలు మోపారు.
వెనిజులాలో సిలియా ఫ్లోరస్‌ను ప్రథమ మహిళగా కాకుండా ఫస్ట్ కాంబాటెంట్ అని కూడా పిలుస్తారు. డ్రగ్ డీలర్ల నుంచి భారీగా లంచాలు తీసుకోవడం, కొకైన్ తరలించేందుకు ప్రైవేటు ఎయిర్‌పోర్టులను దుర్వినియోగం చేయడం, డ్రగ్స్ రాకెట్‌లో ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయం వంటి అనేక ఆరోపణలు ఇప్పుడు సిలియా ఫ్లోరస్‌ను చుట్టుముట్టాయి. 2007లో ఒక అంతర్జాతీయ డ్రగ్ డీలర్, వెనిజులా యాంటీ నార్కోటిక్స్ ఆఫీస్ డైరెక్టర్ నెస్టర్ రెవెరోల్ మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆమె ఏకంగా లక్షలాది డాలర్ల లంచాలు తీసుకున్నట్లు అభియోగాలు మోపారు.
అంతేకాకుండా కొకైన్‌తో వెళ్లే విమానాలు.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా వెళ్లేందుకు ఒక్కో విమానానికి సుమారు లక్ష అమెరికన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.90 లక్షల చొప్పున లంచాలు తీసుకున్నట్లు.. అయితే ఆ డబ్బులో కొంత భాగాన్ని ఆమెకు అప్పగించినట్లు అమెరికా పేర్కొంది. 2015లో సిలియా ఫ్లోరస్ మేనల్లుళ్లు అధ్యక్షుడికి చెందిన ప్రైవేట్ విమానాశ్రయం నుంచి వందల కిలోల కొకైన్‌ను అమెరికాకు పంపించేందుకు అంగీకరించినట్లు ఆధారాలు లభించాయి.
దీనిపై 2017లో వారికి 18 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత ఖైదీల మార్పిడిలో భాగంగా సిలియా ఫ్లోరస్ మేనల్లుళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు. సిలియా ఫ్లోరస్ తన భర్త నికోలస్ మదురో, కుమారుడితో కలిసి రాజకీయ అధికారాన్ని ఉపయోగించి.. వెనిజులాను ఒక డ్రగ్ ట్రాఫికింగ్ కేంద్రంగా మార్చారనేది అమెరికా చేస్తున్న ప్రధాన వాదన. ఈ ఆరోపణలు అమెరికా లాయర్లు కోర్టు ముందు నిరూపించగలిగితే ఆమెకు కఠిన శిక్షలు పడుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Latest News