అమెరికాకు గ్రీన్‌లాండ్‌ కావాలని ట్రంప్ ఎందుకు పట్టుబడుతున్నారు
 

by Suryaa Desk | Mon, Jan 05, 2026, 09:16 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేయాలన్న తన పాత కలని మళ్లీ బయటపెట్టారు. వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత మళ్లీ గ్రీన్‌లాండ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రష్యా, చైనాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు.. అక్కడి అపారమైన ఖనిజ సంపదను చేజిక్కించుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అయితే డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ ప్రజలు దీన్ని ఒక దురాక్రమణ ఆలోచనగా పరిగణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ అధికారికంగా డెన్మార్క్ దేశానికి చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన భూభాగం. 2019లో కూడా ట్రంప్.. ఈ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది.


వ్యూహాత్మక, రక్షణ కారణాలు


ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు పెరుగుతున్నాయని.. డెన్మార్క్ ఒంటరిగా ఈ ప్రాంతాన్ని రక్షించలేదని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా రక్షణ దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ తమ నియంత్రణలో ఉండటం చాలా కీలకమని ఆయన పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇక్కడ అమెరికాకు చెందిన పిటుఫిక్ స్పేస్ బే (గతంలో థూల్ ఎయిర్ బే) ఉంది. ఇది క్షిపణి హెచ్చరికలు, అంతరిక్ష నిఘాకు అత్యంత కీలకమైన కేంద్రం.


యూరప్, ఉత్తర అమెరికా మధ్య అతి తక్కువ దూరంలో ఉన్న మార్గం గ్రీన్‌లాండ్‌ మీదుగానే ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు, ఆధునిక ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, గ్రాఫైట్ వంటి 25 రకాల కీలక ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. మంచు కింద భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. అయితే పర్యావరణ కారణాల దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ ప్రస్తుతం వీటి వెలికితీతను నిషేధించింది.


డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ స్పందన


గ్రీన్‌లాండ్‌ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 'ఇక చాలు.. మా సార్వభౌమాధికారాన్ని గౌరవించండి. గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదు' అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. డెన్మార్క్ ప్రధానమంత్రి మెటె ఫ్రెడెరిక్సన్ కూడా అమెరికా ఈ రకమైన ఒత్తిడిని ఆపాలని కోరారు.


మరోవైపు.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన తర్వాత.. పద్ధతి మార్చుకోకపోతే ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని లాటిన్‌ అమెరికా దేశాలకు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అదే సమయంలో గ్రీన్‌లాండ్‌ గురించి ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సంచలనం రేపింది. అమెరికా జాతీయ జెండా రంగులతో ఉన్న గ్రీన్‌లాండ్‌ మ్యాప్‌ పోస్ట్ చేస్తూ.. త్వరలో అని పేర్కొన్నారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన అమెరికాలోని డెన్మార్క్‌ రాయబారి జెన్సర్ మోయెల్లర్.. డెన్మార్క్‌ ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

Latest News
Trump says Venezuela talks 'working out well' Mon, Jan 12, 2026, 03:05 PM
BSE warns investors about fake deepfake video misusing CEO's identity Mon, Jan 12, 2026, 02:23 PM
Indian households turn investors, bank deposits surge: SBI report Mon, Jan 12, 2026, 01:51 PM
HinduACTion plans Capitol Hill briefing on minorities Mon, Jan 12, 2026, 01:43 PM
Police suspect sexual assault in B'luru techie murder case Mon, Jan 12, 2026, 01:13 PM