|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 09:17 PM
బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ తన భర్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భర్తకు స్లీప్ డివోర్స్ ఇవ్వాలంటూ యూకే ముమ్స్‌నెట్ అనే ఫోరమ్‌లో తన గోడు వెళ్లబోసుకుంది. తన భర్తతో పడుకోవడం ఒక నరకంగా మారిందని.. విడివిడిగా పడుకోవాలని ఉందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తానని.. కానీ అతని నిద్ర అలవాట్లు తనను రోగిని చేస్తున్నాయని ఆమె పేర్కొంది. నేటి కాలంలో దంపతుల మధ్య స్లీప్ డివోర్స్ అనే పదం బాగా వినిపిస్తోంది. ఒకే మంచంపై పడుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలిగి, ఆరోగ్యం దెబ్బతింటున్న సందర్భంలో భాగస్వాములు విడివిడిగా పడుకోవడాన్నే ఇలా పిలుస్తారు.
స్లీప్ డివోర్స్ అంటే ఏంటి?
భాగస్వామి నిద్ర అలవాట్ల వల్ల ఇబ్బంది పడే దంపతులు విడివిడిగా పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అంటారు. దీనివల్ల విడాకులు జరుగుతాయని కొందరు భయపడతారు కానీ.. వాస్తవానికి నిద్ర బాగుంటే దంపతుల మధ్య చిరాకులు తగ్గి బంధం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది.
తన భర్త రాత్రి పూట గట్టిగా గురక తీయడం, భారీ శబ్దాలు చేయడం, అస్తమానం కదలడం వల్ల తనకు నిద్ర పట్టడం లేదని ఆమె తెలిపింది. రాత్రిపూట అనేకసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారీ లైట్లు వేయడం వల్ల తన నిద్రకు భంగం కలుగుతోందని ఆమె ఆరోపించింది. తెల్లవారుజామున 5 గంటలకే అలారం పెట్టుకుని మరీ.. దాన్ని స్నూజ్ చేస్తూ ఉండటం వల్ల తాను తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలిపింది. నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట అలసటగా ఉండటం.. పనులపై ఏకాగ్రత దెబ్బతినడం వంటి సమస్యలను ఆమె ఎదుర్కొంటోంది.
ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె స్లీప్ డివోర్స్ డిమాండ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని.. భర్త భావాల కంటే నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కొందరు సలహా ఇచ్చారు. మరికొందరు.. తాము కూడా విడివిడి గదుల్లోనే పడుకుంటామని.. అది తమ బంధాన్ని మరింత బలపరిచిందని తమ అనుభవాలను పంచుకున్నారు.
వారంలో రెండు రోజులు కలిసి పడుకుని.. మిగిలిన రోజులు విడివిడిగా పడుకోవడం వల్ల సమస్యను సున్నితంగా పరిష్కరించవచ్చని మరికొందరు సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది.
Latest News