|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 09:28 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో న్యూఢిల్లీ తన మొండివైఖరిని వీడకపోతే.. భారత వస్తువులపై మరిన్ని అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మోదీ మంచోడే.. కానీ నేను హ్యాపీగా లేను!
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పీఎం మోదీ చాలా మంచి వ్యక్తి. ఆయన గొప్ప స్నేహితుడు. రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషంగా ఉంచడం వారికి చాలా ముఖ్యం. వారు మాతో వాణిజ్యం కొనసాగిస్తున్నారు. కానీ రష్యా విషయంలో సహకరించకపోతే మేం చాలా వేగంగా పన్నులు పెంచగలం" అని ట్రంప్ హెచ్చరించారు. ప్రధానిపై వ్యక్తిగతంగా గౌరవం ఉందంటూనే.. వాణిజ్య ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.
రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఆర్థిక వ్యవస్థకు భారత్ తోడ్పడుతోందని ట్రంప్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టులో భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్ విధించింది. ఇందులో 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్ కాగా.. మిగిలిన 25 శాతం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు జరిమానాగా విధించారు. ఇప్పటికే భారత్ ఈ భారాన్ని మోస్తుండగా.. ఇప్పుడు ఆ పన్నులను మరింత పెంచుతామని ట్రంప్ బెదిరించడం భారత ఎగుమతిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
యూటర్న్ తీసుకున్నారా?
కొన్ని నెలల క్రితం.. మోదీ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఒక బహిరంగ సభలో ప్రకటించారు. అయితే భారత విదేశాంగ శాఖ దీనిని వెంటనే ఖండించింది. ఇద్దరు నేతల మధ్య అలాంటి సంభాషణే జరగలేదని, తమ దేశ ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామం ట్రంప్‌కు ఆగ్రహం కలిగించినట్లు తాజా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకుంటున్న ట్రంప్.. రష్యాపై ఆర్థిక ఆంక్షల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
భారత వాణిజ్యంపై పడే ప్రభావం
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఐటీ సేవలకు సంబంధించిన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాకు జరిగే ఎగుమతులపై సుంకాలు పెరిగితే భారత్ మార్కెట్ ధరలు పోటీని తట్టుకోలేవు. ఇప్పటికే వెనిజులాపై దాడులు చేసి, ఆ దేశ చమురు నిల్వలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్.. ఇప్పుడు భారత్‌పై ఒత్తిడి పెంచి రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Latest News