|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 11:31 PM
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన షరతు వల్ల ఈసారి విజయ్ హజారే ట్రోఫీ కళ సంతరించుకుంది. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు అద్భుత ప్రదర్శనలు చేశారు. ఇక విజయ్ హజారే ట్రోఫీకి స్టార్ పవర్ మరింత పెరగనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్ , కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు జనవరిలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. ఇదే సమయంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నాహాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. రైల్వేస్‌తో మరో మ్యాచ్ ఆడతాడని వార్తలు వచ్చాయి. దీంతో కోహ్లిని మరోసారి డొమెస్టిక్‌లో చూడచ్చని ఆశ పడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. మ్యాచ్‌కు విరాట్ కోహ్లి దూరమైనట్లు తెలుస్తోంది.
కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లి రైల్వేస్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెప్పింది. కానీ విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ కోచ్ సరన్ దీప్ సింగ్ వెల్లడించారు. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు సన్నాహకంగానే అతను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఆడాలనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో 'కింగ్' అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీ గ్రూప్‌లో ఉన్న ఢిల్లీ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో మొదటి స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆ జట్టు క్వార్టర్స్‌కు వెళుతుంది.
మరోవైపు విజయ్ హజారే టోర్నీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లి.. అద్భుత ప్రదర్శన చేశాడు. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో (131) సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డును బద్ధలుకొట్టాడు. అత్యంత వేగంగా 16 వేల పరుగులు సాధించిన ప్లేయర్‌దా నిలిచాడు.
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (77) బాది రాణించాడు విరాట్ కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు లేని సమయంలో.. భారత ఆటగాళ్లు కనీసం రెండు దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలనే కండిషన్ పెట్టింది బీసీసీఐ. ఈ షరతుతో 15 ఏళ్ల తర్వాత కోహ్లీ ఈ టోర్నీ ఆడటం విశేషం. కాగా, ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా ప్రస్తుతం 'కింగ్' కోహ్లి ప్రయాణం సాగుతోంది.
Latest News