|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:41 AM
వైసీపీ అధినేత జగన్, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాధారణ ఎంపీపీ ఎన్నికల్లో సైతం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎన్నికలను బలప్రదర్శన వేదికగా మార్చారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయగిరి, రాయదుర్గం నియోజకవర్గాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను ఉదాహరిస్తూ, కూటమి ప్రభుత్వ దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని ఈ పరిణామాలు బట్టబయలు చేస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళుతున్న తమ పార్టీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డగించి, దాడులకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఈ దాడిలో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం, వారు ఓటు వేయకుండా అడ్డుకోవడమే. భయాందోళనలు సృష్టించి, బలప్రయోగంతో వారి ఓటు హక్కును కాలరాయడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతేయడానికి పథకం ప్రకారం ప్రయత్నించారు" అని జగన్ వివరించారు. ఈ అప్రజాస్వామిక చర్యల సమయంలో పోలీసులు టీడీపీకి కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి మద్దతు పలికారని ఆయన విమర్శించారు.రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్ మండలంలో కూడా ఇదే తరహా పరిస్థితి చోటుచేసుకుందని జగన్ పేర్కొన్నారు. "అక్కడ కూడా మా వైసీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా ఉండిపోయారు. వారి అండతోనే అక్కడ ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు" అని ఆయన మండిపడ్డారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై దాడులు చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి చర్యలు కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయాయని జగన్ విమర్శించారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబునాయుడు, రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలి. ఒక చిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే, ఈ ప్రభుత్వం ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారిందో స్పష్టమవుతోంది అని జగన్ వ్యాఖ్యానించారు.
Latest News