|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:44 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం టారిఫ్‌ల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ల ద్వారా తమ దేశానికి 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చిందని, త్వరలో మరిన్ని నిధులు రానున్నాయని ఆయన ప్రకటించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.49.8 లక్షల కోట్లు. ఈ విధానం వల్ల దేశం ఆర్థికంగా బలపడటమే కాకుండా, జాతీయ భద్రత కూడా మెరుగుపడిందని ట్రంప్ వాదించారు. సుప్రీంకోర్టులో రానున్న కీలక తీర్పు నేపథ్యంలో మీడియా ఈ అంశాన్ని తక్కువ చేసి చూపుతోందని ఆయన ఆరోపించారు.తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు.మేం టారిఫ్‌ల ద్వారా 600 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాం. కానీ ఫేక్ న్యూస్ మీడియా దీని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారు మన దేశాన్ని ద్వేషిస్తారు, అగౌరవపరుస్తారు. సుప్రీంకోర్టులో రానున్న అత్యంత కీలకమైన టారిఫ్‌ల నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికే మీడియా ఇలా చేస్తోంది అని ట్రంప్ ఆరోపించారు. టారిఫ్‌ల వల్లే అమెరికా మునుపెన్నడూ లేనంతగా ఆర్థికంగా, జాతీయ భద్రతాపరంగా బలంగా ఉందని, ప్రపంచంలో గౌరవం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్, ఆయన బృందం టారిఫ్‌లను జాతీయ భద్రత, విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించడం ప్రారంభించడం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచంలోని పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించారు.ఈ నేపథ్యంలో భారత్ తన ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇతర దేశాలకు ఎగుమతులను విస్తరించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందని, ఈ విధానం రానున్న రోజుల్లో మరింత వేగవంతం కానుందని ఆ కథనం హైలైట్ చేసింది.భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది. మన దేశ మొత్తం వస్తు ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకే వెళుతున్నాయి. గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు వంటివి ఇందులో ప్రధానమైనవి. అయితే, వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాల్లో అమెరికా ఉత్పత్తులకు ద్వారాలు తెరిచే విషయంలో భారత్ దృఢమైన వైఖరితో ఉండటంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంపై సందేహాలున్నాయి.
Latest News