|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:33 PM
ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేయడం దేశంలోనే అరుదైన ఘటన అంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు . ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతికి బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చిన చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, తన అసలు స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసిందని ధ్వజమెత్తారు. అధికార మత్తుతో ప్రజల ఓటు హక్కును అడ్డుకోవడం, భయాందోళన వాతావరణం సృష్టించడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయాయంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ రెండు చోట్ల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతల రౌడీయిజాన్ని ఎక్స్ వేదికగా వైయస్ జగన్ ఎండగట్టారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎంపీపీ ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న వైయస్సార్‌సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడం, వారిపై దాడి చేయడం అత్యంత దారుణం. ఈ దాడుల్లో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, మరో సభ్యుడిని కిడ్నాప్ చేయడం, మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంపై చేసిన బహిరంగ దాడిగా భావించాలి.ఈ చర్యల వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం — ఎంపీపీ ఎన్నికలో వైయస్సార్‌సీపీ సభ్యులు ఓటు వేయకుండా అడ్డుకోవడం. బలప్రయోగంతో భయాందోళన వాతావరణం సృష్టించి, ప్రజల ఓటు హక్కును హరించడం ద్వారా ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక పథకం ప్రకారం జరిగిన ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రయత్నమే అని అన్నారు.
Latest News