|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:33 PM
రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హిందూ ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. టీటీడీ పరిధి లోని తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలోనే తాగుబోతు వీరంగం చేయడం మమ్మూటీకీ భద్రతా వైఫల్యమేనని ఆగ్రహించారు. మరోవైపు తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా... వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను రావొద్దనడం చెప్పడం ఏంటని నిలదీశారు. మరోవైపు గోవింద మాలధారణ భక్తులకూ దర్శనాన్ని నిరాకరించడాన్ని తిరుమల చరిత్రలో అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోందనడానికి ఇదే నిదర్శనమని తేల్చి చెప్పారు. తాజాగా ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం పాపం కూడా టీడీపీదేనని తేల్చి చెప్పిన భరత్... టీడీపీ నేత వీరభద్రరావు సోదరుడే శివలింగాన్ని ముక్కలు చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డాడని ఆక్షేపించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ఘోర అపచారం చేయడమే కాకుండా.. పురావస్తు శాఖ పరిధిలో ఉన్నా వారి ప్రమేయం లేకుండానే రాజమండ్రి నుంచి శివలింగం తెచ్చి పగిలిన లింగం స్ధానంలో ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు. మరోవైపు భూసేకరణతో పాటు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చిన వైయస్.జగన్ కే , భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ ఘనత దక్కుతుందన్న భరత్... దాన్ని కూడా టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని తేల్చి చెప్పారు .
Latest News