|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 08:21 PM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రెండు తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో అమలవుతున్న ఒకే పథకం. తెలంగాణలో మహాలక్ష్మి పేరిట.. ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీశక్తి పేరుతో అమలవుతున్న ఈ పథకం ద్వారా రోజూ లక్షలాది మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఆధార్ కార్డులు చూపించి పథకం ప్రయోజనాలు పొందుతున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగింది. అక్కడక్కడా సీట్ల కోసం మహిళల సిగపట్లు కూడా కామన్‌గా మారిపోయాయి. అలాగే కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఏపీఎస్ఆర్టీసీ బస్ కండక్టర్ సిగ్నల్ వద్ద బస్సు ఎక్కనివ్వడం లేదంటూ ఓ మహిళ ఈ వీడియోను రికార్డు చేశారు. సిగ్నళ్ల వద్ద బస్సు ఎక్కకూడదని.. అది రూలంటూ తనను బస్సు ఎక్కనివ్వలేదంటూ మహిళ వీడియోలో ఆరోపించారు. ఉచిత బస్సు పథకం పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది ఓవరాక్షన్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ బస్సు మీద ఫిర్యాదు చేస్తానంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాయోలో వైరల్ అవుతుండగా.. నెటిజనం భిన్న రకాలుగా స్పందిస్తున్నారు, ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం రూల్ మార్చాలని.. ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డు చూపించాలని అడగాలని సూచించారు. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నప్పుడే ఈ పథకం ద్వారా పేదవాళ్లకు ఉపయోగం ఉంటుందంటూ ట్వీట్ చేశారు. లేకపోతే ఆర్థిక స్థోమత ఉన్నా కూడా కొంతమంది అప్పనంగా ఫ్రీ బస్ ఉపయోగిస్తున్నారంటూ విమర్శించారు. ఈ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. వాస్తవానికి ఉచిత బస్సు పథకం తెలుగు రాష్ట్రాల కంటే ముందే కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆలోచన చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహా స్మార్ట్ కార్డు ఆలోచన చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని.. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలు ఉంటే.. అందరికీ రేషన్ కార్డులు ఉండవుగా అని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయటం మంచిదనే ఆలోచనలు కూడా వస్తున్నాయి.
Latest News