|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 09:17 PM
తిరుమలలో ఇటీవల ఖాళీ మద్యం సీసాలు దొరకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు లభ్యం కావటం చర్చనీయాంశమైంది. తిరుమలలోని పోలీస్ అతిథి గృహం సమీపంలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కాగా.. టీటీడీ కూడా స్పందించింది. బాలాజీనగర్‌కు ఆనుకుని ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చెట్ల మధ్యలో ఈ ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించినట్లు టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు కారణమైన వారిని గుర్తిస్తామని.. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తాజాగా తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో ముగ్గురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ వైసీపీ నేతతో పాటుగా.. ఇద్దరు మీడియా ప్రతినిధుల ప్రమేయం ఇందులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలోకి మొదటగా వైసీపీ నేతకు చెందిన వాహనం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరు మీడియా ప్రతినిధులు అక్కడకు వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మద్యం బాటిళ్ల దృశ్యాలను చిత్రీకరించిం.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు తిరుమల పోలీస్ అతిథి గృహం వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయనే వార్తపై పోలీసులు కూడా స్పందించారు. పోలీస్ అతిథి గృహం వద్ద మద్యం సీసాలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోందని.. అందులో పోలీస్ అతిథి గృహానికి ఎలాంటి సంబంధం లేదంటూ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారా.. లేదా ఆకతాయిలు ఎవరైనా తాగి పడేశారా అనే దానిపై దర్యాప్తు జరుపుతామని.. సీసీ కెమెరాల ద్వారా అసలు సంగతి తేలుస్తామని తిరుపతి పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ ఘటనలో ముగ్గురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నారు. అయితే తిరుమలలో మద్యం సీసాలు దొరకటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అలిపిరి చెక్ పోస్టు వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాట్లు ఉంటే కొండపైకి మద్యం బాటిళ్లు ఎలా వెళ్లాయంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.