|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 09:57 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో గతేడాది మహా కుంభమేళా జరగ్గా.. ప్రస్తుతం మరో మాఘ మేళా మొదలైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈసారి అక్కడ మాఘ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 44 రోజుల పాటు సాగే ఈ మాఘ మేళా.. పౌష పూర్ణిమ నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవంలో కోట్లాది మంది భక్తులు సంగమ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మాఘ మేళాకు విచ్చేసే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, రవాణా ఏర్పాట్లు చేసింది. కుంభమేళా స్థాయి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రశాంతమైన వాతావరణంలో పొందాలనుకునే వారికి ఈ మేళా సరైన వేదిక అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
పవిత్ర త్రివేణి సంగమం వద్ద మాఘ మేళా 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 3వ తేదీన పౌష పూర్ణిమ పుణ్యస్నానంతో మొదలైన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి వరకు మొత్తం 44 రోజుల పాటు కొనసాగనుంది. కుంభమేళాతో పోలిస్తే తక్కువ రద్దీ.. ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పారవశ్యాన్ని పొందేవారికి ఇది ఒక చక్కని అవకాశంగా మారనుంది.
గతేడాది జరిగిన మహా కుంభమేళా రద్దీతో పోలిస్తే.. ఈ మాఘ మేళా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. గంగ, యమున, అంతర్వాహిని అిన సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మాఘ మేళా ప్రారంభ తొలి రోజు అయిన పౌష పూర్ణిమ నాడే సుమారు 21.5 లక్షల మంది భక్తులు సంగమ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
ఈ మేళాలో ఆరు ప్రధాన స్నాన దినాలు ఉన్నాయి. మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 18), వసంత పంచమి (జనవరి 23), మాఘీ పూర్ణిమ (ఫిబ్రవరి 1), మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భక్తుల సౌకర్యార్థం 800 హెక్టార్ల మేళా ప్రాంతాన్ని 7 సెకార్లుగా విభజించారు. సుమారు 3800 ప్రత్యేక బస్సులు.. 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
ఈ మాఘ మేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 17 పోలీస్ స్టేషన్లు, 42 అవుట్ పోస్టులు, 400 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం మేళా ప్రాంగణంలోనే రెండు 20 పడకల ఆస్పత్రులను నిర్మించారు.
కుంభమేళాకు, మాఘ మేళాకు తేడా ఏమిటి?
ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి అత్యంత భారీ స్థాయిలో జరిగేది కుంభమేళా. అయితే ఈ మాఘ మేళా మాత్రం ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. కుంభమేళాలో ఉండే సాధువుల సమాగమం, దానధర్మాలు, హారతులు, ఆధ్యాత్మిక చర్చలు అన్నీ మాఘ మేళాలోనూ ఉంటాయి. కానీ కుంభమేళాతో పోల్చితే.. మాఘ మేళాలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉండి.. ప్రశాంతంగా దర్శనం చేసుకునే వీలుంటుంది.
Latest News