|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 10:02 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాగ్‌పత్ జిల్లాలో మూగజీవి పట్ల ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. కుక్కను దారుణంగా హింసించి.. ఆ వ్యక్తి దానికి మద్యం కూడా తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుక్కను హింసించడమే కాకుండా.. దానికి బలవంతంగా మద్యం తాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
బాగ్‌పత్ జిల్లాలోని కీర్తల్ గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో జంతు ప్రేమికులు , నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వైరల్ వీడియోలో.. నిందితుడు ఒక కుక్కను పట్టుకుని.. దాన్ని హింసిస్తూ ఒక సీసాలోని మద్యాన్ని బలవంతంగా దాని నోట్లో పోశాడు. ఆ కుక్క తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ వదలకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇక వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన రమాలా పోలీసులు.. నిందితుడిని కీర్తల్ గ్రామానికి చెందిన జితేంద్ర అలియాస్ బల్లంగా గుర్తించారు. సోషల్ మీడియా సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదివారం జితేంద్రను అరెస్ట్ చేశారు. అతనిపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మూగజీవాల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. ఆ కుక్క పడుతున్న వేదన చూసి జంతు ప్రేమికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ వ్యక్తి మనిషి లాగా కాకుండా రాక్షసుడి లాగా ప్రవర్తించాడని తిట్టిపోస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని.. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని యానిమల్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు వేయకపోతే.. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. నోరు లేని మూగజీవాలని అలా హింసించడాన్ని జంతు ప్రేమికులు తట్టుకోలేకపోతున్నారు.
Latest News