|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 11:28 PM
విహార యాత్రలకు వెళ్లినప్పుడు పసిపిల్లలు వెంట ఉంటే.. పర్యాటకులు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లి లేదా తండ్రి వారిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ.. ఎత్తుకునే, చేయి పట్టుకునే తిరుగుతుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ విహార యాత్రలో భాగంగా చైనాకు వెళ్లిన ఓ పాకిస్థాన్ జంట వింతగా ప్రవర్తించింది. ముఖ్యంగా 5 నెలల వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలతో అక్కడకు వెళ్లిన దంపతులు.. అక్కడే ఓ పార్కులో తిరిగారు. ఆపై అక్కడున్న సెక్యూరిటీ గార్డుకు పిల్లలను అప్పగించి వేరే ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిపోయారు. ఈ వింత ఉదంతం చైనాలోని గైజౌ ప్రావిన్స్‌లో ఉన్న ప్రసిద్ధ కియాన్లింగ్ మౌంటైన్ పార్కులో వెలుగు చూసింది.
కేబుల్ కార్ కోసం పిల్లల అప్పగింత
డిసెంబర్ 22వ తేదీన పాకిస్థాన్‌కు చెందిన ఒక పర్యాటక జంట తమ ఐదు నెలల వయసున్న కవల పిల్లలతో (ఒక బాబు, ఒక పాప) కలిసి ఈ పార్కును సందర్శించారు. అక్కడి కొండల అందాలను చూడటానికి వారు కేబుల్ కార్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. అయితే పిల్లలు ఉన్న స్ట్రోలర్‌ను కేబుల్ కార్‌లోకి తీసుకెళ్లడం కష్టమని భావించిన ఆ జంట.. అక్కడే విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు చెన్ వద్దకు వెళ్లారు. తమకు చైనీస్ భాష సరిగ్గా రాకపోయినా.. సైగలతో పిల్లలను కాసేపు చూసుకోవాలని కోరి.. ఎటువంటి కాంటాక్ట్ నంబర్లు ఇవ్వకుండానే అక్కడి నుండి షికారుకు వెళ్లిపోయారు.
తల్లిదండ్రులు వెళ్లిన కొద్ది సేపటికే ఆ పసి బిడ్డలు ఏడవడం ప్రారంభించారు. ఇది గమనించిన పార్కులోని ఇతర పర్యాటకులు, స్థానికులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు చెన్ ఆ పిల్లలకు బాటిళ్లతో పాలు తాపగా.. మరో మహిళ వారిని ఆడించే ప్రయత్నం చేసింది. ఒక పక్క గార్డు విధుల్లో ఉండటంతో.. అక్కడ ఉన్న ఇతర మహిళలు పిల్లల దుప్పట్లు సరిచేస్తూ, వారు భయపడకుండా తక్కువ స్వరంతో మాట్లాడుతూ అక్కున చేర్చుకున్నారు.
ఈ క్రమంలోనే ఒక చిన్నారి విరామం లేకుండా ఏడవడంతో చెన్ పరిశీలించగా.. ఆ పాప డైపర్ పాడైనట్లు గుర్తించారు. తన చేతులు చల్లగా ఉండటంతో పాపకు ఇబ్బంది కలగకూడదని భావించి.. చెన్ అక్కడే ఉన్న మరో మహిళ సాయం కోరారు. ఆ మహిళ ఎంతో ప్రేమతో పాపకు డైపర్ మార్చడంతో ఆ చిన్నారి శాంతించింది. ఈ దృశ్యాలను చూసిన వారంతా చైనా ప్రజల ఆత్మీయతను మెచ్చుకుంటున్నారు.
గంట తర్వాత ఐస్‌క్రీమ్‌లతో ప్రత్యక్షం
సుమారు ఒక గంట పాటు హాయిగా పార్కును చుట్టేసిన ఆ జంట.. చేతిలో ఐస్‌క్రీమ్‌లతో తిరిగి వచ్చారు. తమ పిల్లలను క్షేమంగా చూసుకున్న గార్డుకు, స్థానికులకు చైనీస్ భాషలో కృతజ్ఞతలు తెలిపి తమ బిడ్డలను తీసుకెళ్లారు. ఈ ఘటనపై సెక్యూరిటీ గార్డ్ చెన్ స్పందిస్తూ.. "నేను ఒక గార్డునే కాకుండా ఒక మనవరాలికి నానమ్మగా కూడా మారాను. ఆ పిల్లలు బొమ్మల్లా ఎంతో ముద్దుగా ఉన్నారు. వారి భద్రతను పర్యవేక్షించడం నా బాధ్యతగా భావించి సాయం చేశాను" అని ఆనందంగా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Latest News