|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 11:24 PM
ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్న వెనుజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లే కాదు.. ప్రస్తుతం ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు కూడా భారత్‌తో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పరుచుకున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సైతం పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబాకు భక్తురాలు కావడం చెప్పుకోదగ్గ విశేషం. ఉపాధ్యక్షురాలి హోదాలో పలుసార్లు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చి, సాయికుల్వంత్ మందిరంలో బాబా మహా సమాధిని ఆమె దర్శించుకున్నారు. ఈ వివరాయి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. ఆమె ఆగస్టు 2023, తర్వాత అక్టోబరు 2024లో వరుసగా సాయి ప్రశాంతి నిలయానికి వెళ్లి బాబా సమాధిని దర్శించుకోవడం సత్యసాయి పట్ల ఆమెకున్న నమ్మకానికి నిదర్శనం.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. వెనుజులాలోని పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలు.. సత్యసాయి బాబా, బ్రహ్మ కుమారీలు, రాధా స్వామి వంటి భారతీయ ఆధ్యాత్మికవేత్తలు, సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకున్నాయి. ఇక, ఉపాధ్యక్షురాలి హోదాలో భారత్‌కు వచ్చిన డెల్సీ రోడ్రిగ్జ్ అక్టోబరు 26, 2024లో పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆమెతో పాటు భారత్‌లో వెనుజులా రాయబారి కపాయా రోడ్రిగ్జ్ గొంజాలెజ్ కూడా ఆ సమయంలో ఉన్నారు.
శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్.. ప్రశాంతి నిలయానికి వచ్చిన రోడ్రిగ్జ్‌కు స్వాగతం పలికి, ఆమెను ఆశ్రమం అంతా చూపించారు. ప్రశాంతి నిలయంలోని రెండు ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలై గర్భగుడి, శాంతి భవన్‌లో ఆమె కొంత సమయం గడిపారు. ఏడాది వ్యవధిలోనే రెండోసారి పుట్టపర్తికి రావడం పట్ల రోడ్రిగ్జ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని ట్రస్ట్ తెలిపింది. సత్యసాయి బాబా దివ్య సన్నిధిలో ఉండటం తనకు ‘శాంతి, ప్రశాంతత’ను ఇచ్చిందని ఆమె చెప్పినట్లు పేర్కొంది.
దీనికి ముందు ఆగస్టు 5, 2023న జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన వెనిజులా ప్రతినిధి బృందంలో భాగంగా భారత్‌కు వచ్చిన రోడ్రిగ్జ్.. ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనను వ్యక్తిగతమైనదిగా ఆమె పేర్కొన్నారు. అలాగే, అక్టోబరు 2019లోనూ పలువురు వెనుజులా మంత్రులతో కలిసి రోడ్రిగ్జ్ పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చి, బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఇక, నికోలస్ మదురోకు వివాహానికి ముందే తన భార్య ద్వారా సత్యసాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బాబాకు భక్తుడిగా మారిపోయారు. వెనుజులా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 2005లో భారత్‌కు వచ్చిన మదురో దంపతులు.. బాబా ఆశీస్సులు తీసుకున్నారు.
Latest News