|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 11:35 PM
రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ .. అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాల మీద సుంకాలతో విరుచుకుపడ్డారు. రష్యా నుంచి చవకగా చమురు కొంటున్నామనే అక్కసుతో మన దేశం మీద కూడా భారీగా సుంకాలు విధించారు. మరి ప్రపంచ దేశాల మీద సుంకాల బాంబు వదిలిన ట్రంప్.. దాని వల్ల అమెరికాకు ఎంత ఆదాయం రాబోతుందో వివరిస్తూ ఒక ప్రకటన చేశారు. సుంకాల వల్ల అమెరికాకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని.. ఇంకా వస్తూనే ఉందని తెలిపారు.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాకు సుమారు $600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో సుంకాలు వస్తాయని తెలిపారు. ఈ సుంకాల వల్ల దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ రెండూ చాలా బలంగా మారాయని ఆయన ప్రకటించారు. "మన దేశానికి 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సుంకాలు వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. కానీ ఫేక్ న్యూస్ మీడియా దీని గురించి మాట్లాడదు. ఎందుకంటే వాళ్లకు మన దేశం అంటే ద్వేషం. మనపై వారికి గౌరవం లేదు" అని మండిపడ్డారు.
"ఈ మీడియా సంస్థలు రాబోయే సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన తీర్పు" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సుంకాల వల్ల అమెరికా ఆర్థికంగా, జాతీయ భద్రత విషయంలో ఎప్పుడూ లేనంత బలంగా, గౌరవంగా మారిందని ఆయన తెలిపారు.
గత సంవత్సరం, ట్రంప్ తన రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది నెలల్లోనే, ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా సుంకాలు విధించారు. చాలా దేశాలు అమెరికాను అన్యాయంగా చూస్తున్నాయని, ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా, భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఇందులో రష్యా నుంచి భారతదేశం కొనుగోలు చేసే చమురుపై 25 శాతం సుంకం కూడా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ భారత్‌పై సుంకాలను మరింత పెంచే అవకాశం ఉందని ప్రకటించారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం పట్ల తాను సంతోషంగా లేనని.. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలుసన్నారు. "ఇండియా.. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. అమెరికా సుంకాలను మరింత పెంచుతుంది.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మంచిది కాదు" అన్నారు. అమెరికా విధించిన సుంకాల వల్లే ఇండియా ఇప్పుడు రష్యా నుంచి తక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Latest News