|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:07 PM
బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో భాగంగా ఏపీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇది భారత్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. "బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G)లో M/s రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా NHAI 24 గంటల్లోనే 28.95 లేన్-కిలోమీటర్ల పొడవున, 10,675 మెట్రిక్ టన్నుల తారు కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది" అని సీఎం చంద్రబాబు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దార్శనికత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణం, ఇంజినీర్లు, కార్మికుల అసాధారణ నిబద్ధత వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఇదే కారిడార్‌లోని ఇతర ప్యాకేజీలలో 2026 జనవరి 11 నాటికి మరో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
Latest News