క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న లోకేశ్
 

by Suryaa Desk | Wed, Jan 07, 2026, 09:41 PM

క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువునష్టం కేసులో న్యాయం తన వైపు ఉందని, తప్పకుండా గెలుస్తానని పేర్కొన్నారు. తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం కేసులో బుధవారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు.క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, 2019లో ఆనాడు టీడీపీ ఓడిపోయినప్పుడు కుట్రపూరితంగా తప్పుడు వార్తలు రాసి, వ్యక్తిగతంగా తన పరువుకు భంగం కలిగించాలని తన ఫోటో పెట్టి, కింద క్యారికేచర్ వేసి అసత్య కథనం ప్రచురించారని అన్నారు. తాను విశాఖకు వచ్చినప్పుడు ఐదేళ్లలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో స్నాక్స్ కు రూ.25 లక్షలు ఖర్చుపెట్టానని రాశారని గుర్తు చేశారు. 'చినబాబు చిరుతిండికి 25 లక్షలండి' అనే టైటిల్ తో ఏకంగా తన ఫోటో పెట్టి ఆర్టికల్ రాశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ రోజు నుంచే తాను సాక్షిపై పోరాటం మొదలుపెట్టానని, ఎవరిపైనైనా ఆర్టికల్ రాసేప్పుడు నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచించారు. సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి వారి అభిప్రాయం తెలుసుకోవాలని, అలాంటివేవీ చేయకుండా తనను కించపరిచేవిధంగా సాక్షిలో ఆర్టికల్ రాసి పబ్లిష్ చేయడం జరిగిందని మండిపడ్డారు. దీనిపై గత ఆరేళ్లుగా తాను పోరాటం చేస్తున్నానని, ఈ కేసుపై విశాఖకు రావడం ఇది ఏడోసారి అని తెలిపారు. ఆ రోజు ద వీక్ అనే మేగజైన్ కూడా ఆర్టికల్ రాసినప్పుడు నోటీసులు పంపానని, ఏ తేదీల్లో అయితే ప్రచురించారో ఆ తేదీల్లో తాను విశాఖలో లేనని ఆధారాలతో సహా నిరూపించానని అన్నారు. అది తెలుసుకుని వారు రీజాయిండర్ వేసి, క్షమాపణలు కూడా కోరినట్లు తెలిపారు."2014-19 మధ్య గానీ, ఇప్పుడు గానీ నేను విశాఖకు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ కూడా తీసుకోవడం లేదు, గెస్ట్ హౌస్ లో కూడా నేను ఉండటం లేదు. నేను వినియోగించే రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కావు. వాటి డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్, కాఫీ ఖర్చు కూడా నాదే. ఎయిర్ పోర్ట్ లాంజ్ లో నాయకులతో ఐదు నిమిషాలు మాట్లాడాలంటే కాఫీ, కాఫీ పౌడర్, చివరకు మగ్గు కూడా నాదే. ఇది మా అమ్మగారు నాకు నేర్పించిన సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు పవిత్రమైన బాధ్యత మనపై పెట్టారు. వారు ఏ నమ్మకంతో మనల్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఏ ఖర్చులు ఉన్నా కుటుంబపరంగా మేం భరిస్తాం. ఇంట్లో అమ్మ, బ్రాహ్మణి సంపాదిస్తే.. చంద్రబాబు గారు, నేను ఖర్చుపెడుతున్నాం. నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా బ్రాహ్మణి కడుతున్నారు. పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో మేం చేస్తున్నాం. నేను ఎప్పుడు విశాఖకు వచ్చినా టీడీపీ కార్యాలయంలోనే బస చేస్తున్నాను. కార్యకర్తలను కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికైనా వెళ్లడం జరుగుతోంది" అని అన్నారు."క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. దీనిపై పోరాడాలని ఆనాడే నిర్ణయించుకున్నా. తప్పుడు రాతలపై నాడు, నేడు, ఎప్పుడూ నేను పోరాడతా. రెండు కాదు, ఐదు కాదు.. మరో ఏడాది గడిచినా న్యాయం నావైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నమ్ముతున్నాను. నేను ఏనాడూ తప్పుచేయలేదు, చేయను, చేయబోను. సాక్షిపై పరువునష్టం కేసులో నా ఎగ్జామినేషన్ ఈ రోజుతో పూర్తయింది. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను" అని తెలిపారు."విశాఖ ఎకనమిక్ రీజియన్ కోసం స్టీల్ ప్లాంట్ భూములు తీసుకుంటున్నామనేదే ఆరోపణ మాత్రమే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎవరూ ప్రకటన చేయలేదు. విశాఖ స్టీల్ కోసం రూ.14వేల కోట్లు ఖర్చుచేయడం జరిగింది. మూడో బాయిలర్ కూడా మేం యాక్టివేట్ చేశాం. ఫుల్ ప్రొడక్షన్ కు మేం తీసుకువచ్చాం. గతంలో కూడా ఇదే పరిస్థితి వస్తే వాజ్ పేయి గారు, చంద్రబాబు గారు కలిసి విశాఖ ఉక్కును కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు గారు కలిసి విశాఖ ఉక్కును కాపాడుతున్నారు. అపోహలు అవసరం లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, జరగనివ్వం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేం అందరం కోరుకుంటున్నాం. పదేపదే బెయిల్ అవుట్ లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి. ఇందుకు అందరూ సహకరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన భూమిని ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాలనే ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి లేదు. సీపీఎం సోదరులకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వారే దానికి సమాధానం చెబితే బాగుంటుంది అని అన్నారు.భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం ఇక్కడ మేం ఎవరం పోరాడటం లేదు. పనిచేసేందుకు, ప్రజలకు పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు మేం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇదే జగన్ రెడ్డి ఆనాడు ఏం చెప్పారో గుర్తుచేసుకోవాలి. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అని జగన్ రెడ్డి ఆనాడు చెప్పారా, లేదా ఇందుకు సంబంధించిన వీడియోను అందరూ చూశారు. ఇప్పుడు వచ్చి అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఆనాడు జీఎంఆర్ కు సుమారు 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్నడిగితే అది ఇంకా తక్కువ. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు 5వేల ఎకరాలు ఇచ్చారు. ఆనాడు ఇదే పెద్దమనుషులు ఎయిర్ పోర్ట్ కు 5వేల ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. ఈ రోజు బెంగళూరు పరిస్థితి మనం చూస్తున్నాం.ఒక విజన్ తో చంద్రబాబు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి జీఎంఆర్ కు ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నారు. సుమారు 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చాం. ఎయిర్ పోర్ట్ అంటే లార్జర్ ఎకో సిస్టమ్ అవసరం. ఎంఆర్, ఇంజన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్ లాంటి ఎకో సిస్టమ్ అవసరం. ఇవన్నీ ఏర్పాటుచేస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించగలం. అశోక్ గజపతిరాజు గారి దయవల్ల మాన్సాస్ తో ఒప్పందం చేసుకుని వరల్డ్ క్లాస్ ఏవియేషన్ సిటీని జీఎంఆర్ అభివృద్ధి చేస్తోంది. క్రెడిట్ కావాలంటే వైసీపీ తీసుకోవచ్చు. అది నో ఇష్యూ. దాంతో పాటు పీపీఏల రద్దు, అమర్ రాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసిందీ, ఆనాడు లేబర్, పొల్యూషన్ అంటూ అనేక కంపెనీలను తరిమేసిందీ, ఆనాడు పల్లా శ్రీనివాసరావు గారి కమర్షియల్ కాంప్లెక్స్ కు అన్ని అనుమతులు ఉన్నా పగలగొట్టిన క్రెడిట్ కూడా తీసుకోవచ్చు అని తెలిపారు.రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని లోకేశ్ అన్నారు. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ను అందరికంటే ముందు నేను కలిశానని అన్నారు. మిథాలీ రాజ్ గారిని ఏసీఏ అడ్వైజర్ గా నియమించామని చెప్పారు. 'షీ ప్లేస్' అనే కార్యక్రమాన్ని రూపొందించామని, ఇదో నిరంతర ప్రక్రియ అన్నారు. క్రీడల కోసం ఆస్ట్రేలియాలో గ్రిఫిట్ అనే యూనివర్సిటీ ఉందని, ఇక్కడున్న యూనివర్సిటీలతో గ్రిఫిట్ యూనివర్సిటీని అనుసంధానించి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు."మధురవాడలో డేటా సెంటర్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అయినప్పుడు రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు. అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వైసీపీ హయాంలోనే 108 వాహనాలు మూతపడ్డాయి తప్ప కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసివేయలేదు" అని తెలిపారు.చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధాని అమరావతిని తరలించలేకపోయింది. ఆనాడు ముందు చూపుతో చంద్రబాబునాయుడు గారు భూముల విషయంలో రైతుల పక్షాన అగ్రిమెంట్ చేశారు. అందుకే రాజధానిని తరలించలేకపోయారు. ఈ రోజు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో కూడా అద్భుతమైన ఎయిర్ పోర్ట్ చాలా అవసరం. అందుకే భూములు తీసుకుని మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని మంత్రి వెల్లడించారు.99 పైసలకే భూములు ఇస్తే తప్పేంటి. ఫార్చ్యూన్-500 కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూమి ఇస్తాం. తప్పేంటి? ఉద్యోగాలు కల్పించేందుకే మేం ఇక్కడ ఉన్నాం. ఐదేళ్లలో వైసీపీ చేయలేనిది మేం 18 నెలల్లో చేశాం. ఇన్సెంటివ్స్ తో పాటు భూములు కూడా తక్కువ ధరకు ఇచ్చాం కాబట్టే కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడుల్లో ఏపీ నెం.1 స్థానంలో ఉంది. 25శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు తీసుకువస్తున్నాం. క్లస్టర్ విధానంలో మేం ముందుకు వెళ్తున్నాం" అని తెలిపారు.మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్ భారతిపై పరుష వ్యాఖ్యలు చేసిన మా కార్యకర్తపై చర్యలు తీసుకున్నామని, అతను జైలుకు కూడా వెళ్లాడని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాటు నాపైన, మా కుటుంబంపైనా సోషల్ మీడియాలో బురద జల్లారని, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను కించపరిస్తే ఎంత ఇబ్బంది పడతారో నేను కళ్లారా చూశానని, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియాకు రావాలంటే ఒక వయస్సు అనేది ఉంటుందని, అది పాటించడం లేదని, అవన్నీ మేం చర్చిస్తున్నామని అన్నారు.


 


 

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM