|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 06:54 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులలో ఏర్పాటు చేసిన ప్లాట్లకు ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ప్లాట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జెడ్ఎం నాగకుమార్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా విషయానికి వస్తే కళ్యాణదుర్గం, కూడేరు, తాడిపత్రి మండలాల్లో ఈ ఎంఎస్ఎంఈ ప్లాట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 31.49 ఎకరాలలో 293 ప్లాట్లు సిద్ధం చేశారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో 12.30 ఎకరాలలో 88 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కూడేరులో 7.23 ఎకరాల్లో 93 ప్లాట్లు, తాడిపత్రి మండలం ఊరిచింతలలో 10.86 ఎకరాల భూమిలో 112 ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ ప్లాట్లను ఇప్పుడు పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. ఇందుకోసం వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలు ఈ ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తారు. అనంతరం ఆ ప్లాట్లలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు వేగవంతం
మరోవైపు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు అధికారులను ఆదేశించింది. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ మూడు దశలలో ఈ పార్కులు ఏర్పాటు చేయాలని విజయానంద్ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 55 పార్కులకు గానూ.. 16 ప్రారంభించామని.. మరో 39 పార్కులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. రెండో దశలో 45 చోట్ల, మూడో దశలో 75 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం కొన్నిచోట్ల అవసరమైన భూమిని ఏపీఐఐసీకి అప్పగించామని.. మిగతా చోట్ల భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
Latest News