|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:01 PM
మన దేశంలో సామాన్య ప్రయాణికులు రైల్వేల్లో ప్రయాణించేందుకు పడే కష్టాలను ప్రతిబింబించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియోకు వస్తున్న కామెంట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా ఒక విదేశీ నెటిజన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. దాదాపు 20 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో.. కిక్కిరిసి ఉన్న రైలు ఎక్కడానికి ఒక వ్యక్తి పడుతున్న పాట్లు కనిపిస్తోంది.
ఆ రైలు కదులుతున్నా సరే.. జనరల్ బోగీలో కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు లేకపోయినా.. ఆ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి మరీ రైలు బయట ఫుట్‌బోర్డుపై వేలాడుతూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 'భారతదేశంలో సామాన్యుడి జీవితం' అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోపై స్పందిస్తూ కెనడాకు చెందిన జయంత్ భండారీ అనే నెటిజన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులు బొద్దింకల్లా బతుకుతారు.. బొద్దింకల్లాగే చనిపోతారు. వారిని బొద్దింకల్లా చూసే పాలకులకే ఓట్లు వేస్తారు అంటూ జయంత్ భండారీ చేసిన వ్యాఖ్యలు భారత నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. సామాన్యుల కష్టాలను అగౌరవపరిచేలా జయంత్ భండారీ మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
మరోవైపు.. ఈ వీడియో వైరల్ కావడంతో సగటు భారతీయుడు.. దేశంలో ఉన్న మౌలిక వసతుల కల్పనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భారత రైల్వే వ్యవస్థలోని లోపాలను నెటిజన్లు ఎండగడుతున్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. సామాన్యుడికి కనీసం సురక్షితమైన ప్రయాణం అందుబాటులో లేకపోవడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మన దేశంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోయింది అని కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని.. సామాన్యులు కేవలం బతకడానికి పోరాడుతున్నారని మరికొందరు నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Latest News