|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:33 PM
తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ ఆరోపించారు. తాజాగా, ఈ వ్యాఖ్యలను ఖండించిన భారత్.. లుత్నిక్ చెప్పినదాంట్లో నిజం లేదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ఈ చర్చ ‘ఖచ్చితమైనది కాదు’ అని పేర్కొంటూ.. న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఏడాదికిపైగా నిరంతరం, వివరణాత్మక చర్చలు జరుపుతున్నాయని నొక్కి చెప్పింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ఇరుపక్షాలు గత సంవత్సరం ఫిబ్రవరి 13న వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించాయని, అప్పటి నుంచి పరస్పరం ప్రయోజనకరమైన ఫలితాన్ని సాధించే లక్ష్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపాయి’ అని తెలిపారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయని, పలుమార్లు ఒప్పందం దగ్గరగా వచ్చిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై ఆసక్తితో ఉన్నామని, దానిని త్వరలో ముగిస్తామని ఆయన తెలిపారు.
అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్ లూస్నిక్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్‌తో చర్చలు విఫలమయ్యాయని, అమెరికా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇరు దేశాల ఉన్నత స్థాయి రాజకీయ సంభాషణల్లో ఎలాంటి అంతరాయం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఆయన గుర్తు చేశారు. ‘2025లో ప్రధాని (మోదీ), అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో ఎనిమిది సార్లు మాట్లాడుకున్నారు. మన విస్తృత భాగస్వామ్యంలోని వివిధ అంశాలపై చర్చించారు’ అని ఆయన తెలిపారు. భారత్‌పై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే వంకతో 50 శాతం టారిఫ్‌లు విధించారు. వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే సుంకాలు తగ్గింపుపై స్పష్టత వస్తుంది.