|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 08:55 PM
సంక్రాంతి పండగ అంటే తెలుగు ప్రజలకు ముందుగా ఆంధ్రప్రదేశ్ , అందునా ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకు వస్తాయి. సంక్రాంతి సంబరాలు అనగానే గుర్తుకు వచ్చే మరో విషయం కోడి పందాలు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఎక్కడెక్కడి నుంచో పందెం రాయుళ్లు ఏపీకి తరలి వస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కోడి పందాలకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది ఈ పందాలను తిలకించడానికి, పాల్గొనడానికి భారీ ఎత్తున పందెం రాయుళ్లు, సామాన్య ప్రజలు తరలివస్తున్నారు.
ఈసారి హైటెక్ సౌకర్యాలతో బరులను తీర్చిదిద్దుతున్నారు. కోడి పందాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో.. అందునా భీమవరంలోని హోటళ్లు, లాడ్జీలు పూర్తిగా నిండిపోయాయి. ఇదే అదునుగా హోటల్ యజమానులు అద్దెలను భారీగా పెంచుతున్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్‌కు ధీటుగా రోజుకు రూ.15 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని హోటల్స్‌లో అయితే మూడు రోజులకు రూ.లక్ష అద్దె వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా హైదరాబాద్‌లో స్టార్ హోటళ్లు.. సాధారణ రోజుల్లో రూ.9 వేల వరకు వసూలు చేస్తుండగా.. ప్రత్యేక సందర్భాల్లో రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తుంటాయి. ఇప్పుడు భీమవరం హోటళ్లు కూడా ఇదే స్థాయిలో అద్దెలు వసూలు చేస్తున్నాయి. ఈ కోడి పందాల వల్ల భీమవరం హోటల్ ఓనర్ల దశ తిరిగింది. పండగ ఐదు రోజులు వీరు భారీగా సంపాదించుకోబోతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఆకివీడు, తణుకు, నరసాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో దాదాపు 150 హోటళ్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో ఒక్క గది కూడా ఖాళీగా లేదు. హోటళ్లు, లాడ్జీల్లో ఒక రోజుకు మాత్రమే గదులు ఇవ్వడం లేదు. 3 రోజుల ప్యాకేజీతోనే కేటాయిస్తున్నారు. భీమవరం, ఏలూరు, తణుకు ప్రాంతాల్లో హోటల్ స్థాయిని బట్టి, ఒక్క గదికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. భీమవరంలోని రెండు ప్రముఖ హోటళ్లలో, ఒక గదికి.. మూడు రోజులకు రూ.లక్ష చొప్పున 60 గదులను రిజర్వ్ చేశారు. సాధారణ రోజుల్లో, లాడ్జీ, హోటల్ స్థాయిని బట్టి రోజుకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది.
కానీ కోడి పందాల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని... ఈసారి గత సంవత్సరం కంటే ధరలను బాగా పెంచేశారు. దీంతో గోదావరి అందాలను చూడటానికి ప్రణాళికలు వేసుకున్న సామాన్య పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు అయితే గదుల కోసం జిల్లాలోని తమ బంధువులు, రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నారు. మరి కొందరు ప్రైవేటు ఇళ్లు, శుభకార్యాలు నిర్వహించే విడిది వేదికలను అద్దెకు తీసుకుంటున్నారు.
ఇక ఈ సారి కూడా కోడి పందాల్లో.. కోట్లలో డబ్బులు కురిపించేందుకు బరుల నిర్వాహకులు ఇప్పటికే పందెం కాసేవారితో సంప్రదింపులు జరిపారు. కొన్నిచోట్ల, గత సంవత్సరం పెద్ద మొత్తంలో పందెం గెలిచిన వారితో తమ బరికే రావాలని ఒప్పందాలు చేసుకున్నారు. క్రితం సంవత్సరం కోటి రూపాయలకు పైగా పందెం గెలుచుకున్న తాడేపల్లిగూడెంలో, 2.5 కోట్ల రూపాయలకు ఒక పందెం సిద్ధమైంది. దీనిపై నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు.
Latest News