|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:57 PM
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కోరినా మచాడో.. తనకు ఇటీవల వచ్చిన అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చింది. వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురో పతనం తర్వాత కీలక నేతగా ఎదిగిన మచాడో.. తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. దీన్ని నోబెల్ కమిటీ తోసిపుచ్చింది.
ట్రంప్‌కు నోబెల్ బహుమతిని ఇస్తానంటూ మచాడో చేసిన ప్రకటనపై నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని మరొకరికి బదిలీ చేయడం.. ఇంకొకరితో పంచుకోవడం, రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఒకసారి నోబెల్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తర్వాత అది శాశ్వతంగా ఉంటుందని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ నిబంధనల ప్రకారం.. అవార్డు గ్రహీత తన గౌరవాన్ని వేరొకరికి అధికారికంగా బదిలీ చేసే అవకాశం ఉండదు.
వచ్చే వారం అమెరికాలో మచాడో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె ట్రంప్‌ను కలిసి ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. మచాడోకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని తనకు ఇవ్వాలనుకోవడం చాలా మంచి విషయమని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా పట్ల, ముఖ్యంగా తన పట్ల గౌరవంతో మచాడో వాషింగ్టన్ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వెనిజులాలో మార్పులు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించి విచారణ కోసం వాషింగ్టన్‌కు తరలించిన తర్వాత.. వెనిజులాలో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. మచాడో అగ్రపీఠాన్ని అధిష్టించకుండా.. వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మదురో వారసురాలిగా బాధ్యతలు చేపట్టారు.
శాంతి బహుమతిపై ట్రంప్ మక్కువ
గతంలో కూడా తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని అంటూ ట్రంప్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై చెప్పుకున్నారు. తాను రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలల్లోనే 8 యుద్ధాలను ముగించానని.. అందుకోసం తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన వాదించారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఏమీ చేయకపోయినా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని ట్రంప్ విమర్శించారు.
Latest News