సౌదీ అరేబియా ఎడారి కాదు.... గ్రీన్ అరేబియా చరిత్ర బయటపెట్టిన శాస్త్రవేత్తలు
 

by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:58 PM

ఎడారి దేశమైన సౌదీ అరేబియా.. ఇసుక దిబ్బలతో కూడి ఉంటుంది. నదులు, సరస్సులు, పచ్చని మైదానాలు.. ఆ దేశం మొత్తం తిరిగినా మనకు ఎక్కడా కనిపించవు. అయితే సౌదీ అరేబియాను చూస్తే.. ఎప్పటి నుంచో అలాగే ఉంటుందని అంతా భావిస్తారు. అంతెందుకు ఆ దేశ ప్రజలు, అధికారులు కూడా అలాగే అనుకున్నారు. కానీ అక్కడి శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి తేల్చిన విషయాలు ఇప్పుడు సౌదీ అరేబియా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే సౌదీ అరేబియా ఎడారులు ఒకప్పుడు నదులు, సరస్సులతో కూడిన పచ్చని మైదానాలని శాస్త్రీయంగా రుజువైంది.


ఆఫ్రికా-యూరేషియా మధ్య మానవ వలసలకు ఈ గ్రీన్ అరేబియా కీలక మార్గంగా ఉండేదని శాస్త్రవేత్తలు తమ ఆధారాలను బయటపెట్టారు. పురావస్తు ఆధారాలు, శాటిలైట్ మ్యాపింగ్, గుహల్లోని ఖనిజ నిక్షేపాలు విశ్లేషించడం ద్వారా ఈ శాస్త్రీయ పరిశోధనలు సౌదీ అరేబియా పచ్చదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఈ చారిత్రక ఆధారాల స్ఫూర్తితో.. సౌదీ ప్రభుత్వం ప్రస్తుతం సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ ద్వారా 1000 కోట్ల మొక్కలు నాటి అక్కడ ఉన్న ఎడారిని మళ్లీ పచ్చగా మార్చేందుకు బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది.


ఒకప్పటి గ్రీన్ అరేబియా


ప్రస్తుతం 95 శాతం ఎడారితో నిండిన సౌదీ అరేబియా.. గతంలో అత్యంత తేమతో కూడిన ప్రాంతమని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో గుర్తించారు. అంతరిక్షం నుంచి తీసిన శాటిలైట్ చిత్రాల్లో ఎడారి ఇసుక పొరల కింద దాగి ఉన్న 10 వేలకు పైగా పురాతన సరస్సులు, నదీ వ్యవస్థలు బయటపడ్డాయి. సౌదీ అరేబియాలో జరిపిన తవ్వకాల్లో ఏనుగులు, హిప్పోపోటమస్లు, మొసళ్లు, ఆస్ట్రిచ్‌ల అవశేషాలు లభించాయి. ఇవి నీరు సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే జీవించగలవని శాస్త్రవేత్తలు ధృవీకరించారు.


సుమారు 4 లక్షల ఏళ్ల క్రితమే మానవులు ఆఫ్రికా నుంచి అరేబియా మీదుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని.. ఆ సమయంలో అరేబియా ఒక పచ్చని మార్గంగా ఉండేదని పురావస్తు శాస్త్రవేత్త మైఖేల్ పెట్రాగ్లియా వెల్లడించారు. అయితే వాటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా బయటపెట్టారు. మధ్య సౌదీ అరేబియాలోని గుహల్లో లభించిన స్టాలాగ్‌మైట్‌ల రసాయన విశ్లేషణ ద్వారా గత 80 లక్షల ఏళ్లలో అరేబియాలో అనేకసార్లు భారీ వర్షాలు కురిసినట్లు తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారి అయిన రుబ్ అల్ ఖలీలో ఒకప్పుడు 1100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భారీ సరస్సు ఉండేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.


గతంలో అరేబియా పచ్చగా ఉండేదన్న నిజం.. ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పునరుద్ధరణ పనులకు స్ఫూర్తినిస్తోంది. సౌదీ అరేబియాలో ఎడారీకరణను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మొక్కలను నాటాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి సుమారు 15.1 కోట్ల మొక్కలు నాటడం పూర్తి చేశారు. దాని వల్ల 5 లక్షల హెక్టార్ల భూమిని పునరుద్ధరించారు.


నీటి ఎద్దడిని తట్టుకునే దేశీయ మొక్కలను ఎంచుకోవడం, శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించడం, డ్రోన్ల సాయంతో విత్తనాలను చల్లడం వంటి అత్యాధునిక పద్ధతులను వాడుతున్నారు. 2030 నాటికి 60 కోట్ల మొక్కలను నాటాలని సౌదీ అరేబియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా నగరాల్లో ఉష్ణోగ్రతలను కనీసం 2.2 డిగ్రీ సెల్సియస్ తగ్గించాలని యోచిస్తోంది.

Latest News
'He walks the talk...,' Shreyas lauds Kohli's years of consistency Mon, Jan 12, 2026, 11:18 AM
Karur stampede case: Vijay to appear before CBI today in Delhi Mon, Jan 12, 2026, 10:59 AM
Trump says only his 'morality' limits his power Mon, Jan 12, 2026, 10:56 AM
Swami Vivekananda carried India's eternal wisdom to world: Prez Murmu on National Youth Day Mon, Jan 12, 2026, 10:45 AM
Bayern rout Wolfsburg to tighten grip on Bundesliga summit Mon, Jan 12, 2026, 10:41 AM