|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:39 PM
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ సడెన్ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీల్ని పెంచేసింది. 2025, ఫిబ్రవరి 1 తర్వాత ఎస్బీఐ ధరల్ని సవరించడం ఇదే తొలిసారి. ఇంటర్‌ఛేంజ్ రుసుముల్ని పెంచడం వల్ల ఈ ఏటీఎం ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా.. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ATM), ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రాయల్ మెషీన్ ట్రాన్సాక్షన్ ఛార్జీల్ని తిరిగి అంచనా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు సవరించినా ఈ మార్పులు.. 2025, డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఇది బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్ హోల్డర్లపై ప్రభావితం చూపుతుందని స్పష్టం చేసింది. కొన్ని కేటగిరీలకు చెందిన అకౌంట్ హోల్డర్లకు మాత్రం ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.
ఇక్కడ ప్రధానంగా ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంక్ ఏటీఎంలను వినియోగించినప్పుడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలవారీగా ఉచిత ట్రాన్సాక్షన్స్ పరిమితి ఏం మార్చలేదు. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు యథావిధిగా ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో.. నెలకు 5 వరకు ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (చెకింగ్ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్, పిన్ ఛేంజ్, డీటెయిల్స్ అప్డేట్ వంటివి) చేసుకోవచ్చు.
ఉచిత పరిమితులు దాటి చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు పడతాయి. ఇవి గతంలో కంటే పెరిగాయన్నమాట. ఉచిత పరిమితి తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఇప్పుడు రూ. 23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. అంతకుముందు ఇది రూ. 21 ప్లస్ జీఎస్టీగా ఉంది. లిమిట్ దాటిన తర్వాత చేసే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై రూ. 11 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. అంతకుముందు ఇది రూ. 10 ప్లస్ జీఎస్టీ ఉంది.
ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ల విషయానికి వస్తే ఇక్కడ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఎక్కడైనా 10 వరకు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. గతంలో ఇక్కడ ఎలాంటి పరిమితి లేదు. ఇక్కడ అంతకుముందు పరిమితి లేదు గనుక ఛార్జీల్లేవు. ఇప్పుడు లిమిట్ దాటిన తర్వాత ట్రాన్సాక్షన్‌పై రూ. 23 ప్లస్ జీఎస్టీ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై చూస్తే లిమిట్ తర్వాత రూ. 11 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. ఇక ఎస్బీఐ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ సర్వీస్ ఛార్జీల్ని మార్చలేదు. ఎస్బీఐ డెబిట్ కార్డు హోల్డర్స్.. ఎస్బీఐ ఏటీఎంల్లో ట్రాన్సాక్షన్లపై కూడా ఎలాంటి మార్పులు లేవు. ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ట్రాన్సాక్షన్స్‌పైనా ఎలాంటి పరిమితి లేదు.