|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:35 PM
ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభికి సీఎం చంద్రబాబు చురకలు అంటించారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యర్ధాల సేకరణకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత నగరిలో అమృత్ 2.0 కింద రూ.20.13 కోట్ల అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేశారు. నగరి మున్సిపాలిటీలో నీటి సరఫరా పథకం మెరుగుదలకు రూ.13.96 కోట్లు, కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 3.97 కోట్లు, నగరి మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న సురగుంట చెరువు పునరుద్ధరణ రూ. 2.20 కోట్లతో పనులు చేపట్టేందుకు చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు.
ఈ క్రమంలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు చంద్రబాబు చురకలు అంటించారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్వచ్ఛభారత్ కింద కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టామని చంద్రబాబు అధికారులను అడిగారు. స్వచ్ఛభారత్ కింద ఎంత డబ్బులు తీసుకోగలిగామని ప్రశ్నించారు. సీఎం ప్రశ్నకు అధికారి సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్చు చేస్తేనే డబ్బులు వస్తాయని.. శాచురేషన్ స్థాయికి వెళ్లాలి సూచించారు. అయితే అమలులోనే అసలు సమస్య ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
పట్టాభి అన్నీ కథలు మాట్లాడుతుంటారన్న చంద్రబాబు.. బయట మాట్లాడటం, స్టేట్‌మెంట్లు ఇవ్వడం, అమలు చేయడం వేరువేరని అన్నారు. బయట ఉపన్యాసాలు అందరూ ఇస్తారన్ చంద్రబాబు.. లీడర్ అనేవాడు దానిని ఎగ్జిక్యూట్ చేస్తాడంటూ పట్టాభికి సూచించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పట్టాభికి పేరుంది. వైసీపీ నేతలపై ఓ రేంజులో విరుచుకుపడటంలో ముందుంటారు పట్టాభి. పార్టీకి ఆయన చేసిన సేవలకు గానూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పట్టాభికి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది.
Latest News